
అమరావతి : ఇటీవల మిచౌంగ్ తుఫాను ఆంధ్ర ప్రదేశ్ లో భీభత్సం సృష్టించింది. అకాల వర్షాలు, ఈదురుగాలులకు భారీగా పంటనష్టం జరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ తుఫాను కష్టాలింకా తీరనేలేదు... మరో తుఫాను ముప్పు రాష్ట్రానికి పొంచివుందన్న వాతావరణ శాఖ ప్రకటన ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నెలలో మరో తుఫాను ఏపీని తాకే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఈ నెల (డిసెంబర్) 16న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని... ఇది 18వ తేదీ నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తమిళనాడు, శ్రీలంక వైపుగా పయనించే అవకాశాలున్నాయని తెలిపింది. ముందుకు కదులుతూ మరింత బలపడి తీరందాటే సమయానికి భారీ తుఫానుగా మారనుందని అంచనా వేస్తున్నారు. ఇదికూడా ఏపీలోనే తీరం దాటే అవకాశాలు 50శాతం వున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
కొత్తగా ఏర్పడే తుఫాను ఏపీవైపు పయనిస్తే మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 21 నుండి 25వ తేదీవరకు వర్షాల ముప్పు పొంచివుందని... తీరప్రాంతాల్లో ఈదురుగాలుల తాకిడి వుంటుందని తెలిపారు. మిచౌంగ్ తుఫాను కంటే ఈ తుఫాను తీవ్రంత ఎక్కువగా వుండనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Also Read ప్రకాశం బ్యారేజీకి వరద హెచ్చరిక.. నెల్లూరులో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
ఇప్పటికే మిచౌంగ్ తుఫాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులు మిగతా పంటనయినా కాపాడుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా ఏర్పడే తుఫాను ప్రభావం ఏ ప్రాంతాల్లో వుంటుందో తెలీదు... కాబట్టి రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తం కావాలి. ఈ తుఫాను బలపడి ఏపీని తాకేకంటే ముందే రైతులు వ్యవసాయ పనులు పూర్తిచేసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
కొత్తగా బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానుతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతోంది. ఇప్పటికే మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట, ఆస్తినష్టాన్ని అంచనా వేస్తోంది ప్రభుత్వం. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు రాబోయే తుఫాను గురించి ప్రజలకు వివరిస్తూ జాగ్రత్తలు సూచించే అవకాశం వుంది. ఈ తుఫాను ఆంధ్ర ప్రదేశ్ వైపు రాకూడదని కోరుకుంటున్నారు.