AP Night Curfew: ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ.. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ..

By Sumanth KanukulaFirst Published Jan 10, 2022, 2:22 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. 

ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఏపీలో నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. కోవిడ్ కట్టడికి నైట్ కర్ఫ్యూతో పాటుగా  పలు ఆంక్షలను ప్రభుత్వం విధించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌, మాల్స్ నిర్వహించాలని తెలిపింది. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. 

దేవాలయాలు, ప్రార్థనామందిరాల్లో భౌతికదూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని సీఎం జగన్ అన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధించాలన్నారు. బస్సుల్లో ప్రయాణికులు మాస్కు ధరించేలా చూడాలన్నారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి మించకూడదని..  ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదని సీఎం జగన్ ఆదేశించారు. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు నడపాలని.. థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని చెప్పారు. 

కోవిడ్ కొత్త వేరియంట్ నేపథ్యంలో మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వైద్య నిపుణులతో సంప్రదించి మందులు సిద్దం చేయాలని.. ఆ మేరకు కోవిడ్ హోం కిట్లలో మార్పులు చేయాలని సూచించారు. చికిత్సకు ఉపయోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలి.. అవసరమైన మేర కొనుగోలు చేసి సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. 104 కాల్ సెంటర్లను పటిష్టపరచాలని అధికారులకు సూచించారు. కోవిడ్ కేర్ సెంటర్లను సిద్దం చేయాలని అన్నారు. నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఉండాలని చెప్పారు. కోవిడ్ నియంత్రణ చర్యలను సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇక, కోవిడ్ ఆంక్షలకు సంబంధించి త్వరలోనే వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది. 

click me!