అప్పుడే ఆమోదించలేం:ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాపై స్పీకర్ తమ్మినేని

By narsimha lode  |  First Published Dec 11, 2023, 4:44 PM IST

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా విషయమై  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. రాజీనామా లేఖ తమ కార్యాలయంలో అందిందని ఆయన తెలిపారు.


అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  రాజీనామా లేఖ తమ కార్యాలయంలో అందించారని  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం  ప్రకటించారు.ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా లేఖను  అందించిన విషయాన్ని తమ కార్యాలయ ఓఎస్‌డీ  తనకు ఫోన్ లో చెప్పారన్నారు.

సోమవారంనాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ విషయమై  స్పందించారు.  ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు రాజీనామా చేశారో తనకు తెలియదన్నారు. రాజీనామా లేఖను ఆమోదించడానికి కొన్ని పద్దతులున్నాయని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.  ఈ పద్దతుల ప్రకారంగా వ్యవహరించనున్నట్టుగా ఆయన తెలిపారు. ఆళ్ల రామకృష్ణారెడ్డితో మాట్లాడి ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకుంటానని  ఆయన  ప్రకటించారు.

Latest Videos

undefined

ఇవాళ ఉదయం ఆళ్ల రామకృష్ణారెడ్డి  మంగళగిరి ఎమ్మెల్యే పదవితో పాటు, వైఎస్ఆర్‌సీపీకి కూడ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్ లోనే  ఆళ్ల రామకృష్ణారెడ్డి  రాజీనామా చేశారు.ఈ రాజీనామా లేఖను ఇవాళ స్పీకర్ కార్యాలయంలో అందించారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో  ఈ లేఖను అందించారు.  ఎమ్మెల్యే పదవితో పాటు , వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా సమర్పించిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి  ఫోన్ లో కూడ  అందుబాటులో లేకుండా పోయారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. 

మంగళగిరి వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జీగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని నియమించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి  ఎమ్మెల్యే పదవికి, వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేసినట్టుగా  చెబుతున్నారు. అయితే  వ్యక్తిగత కారణాలతోనే  తాను  ఈ రాజీనామాలు చేస్తున్నట్టుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  

2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి నారా లోకేష్ పై  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుండే  నారా లోకేష్ పోటీ చేయనున్నారు.  దీంతో  ఈ స్థానం నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని వైఎస్ఆర్‌సీపీ భావిస్తుందనే  ప్రచారం కూడ లేకపోలేదు.  ఇదిలా ఉంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న గంజి చిరంజీవి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. 

click me!