ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20న ప్రారంభం కానున్నాయి. ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20న ప్రారంభం కానున్నాయి. ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది జూన్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అదే రోజున ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కరోనా నేపథ్యంలో ఒక్క రోజే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. అయితే ఈ నిర్ణయంపై టీడీపీ తీవ్రంగా విమర్శిస్తోంది.
ఈ నెల 20వ తేదీన ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు మాసాల బడ్జెట్ కు ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.