ఏపీలో పడిపోతున్న‌ ఉష్ణోగ్ర‌త‌లు.. ఏజెన్సీ ప్రాంతాల్లో పెరుగుతున్న చ‌లి.. !

By Mahesh RajamoniFirst Published Nov 29, 2022, 4:55 AM IST
Highlights

Amarathi: తూర్పు, ఈశాన్య గాలులు దిగువ ట్రోపోస్పియర్ నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయనీ, దీని వల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కనీస ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయనీ, చల్లని వాతావరణం తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 

Cold waves increase In AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఇదే స‌మ‌యంలో చ‌లి గాలుల తీవ్రత పెరుగుతోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చ‌లి తీవ్ర‌త మ‌రింత‌గా పెరుగుతోంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్ర‌త‌లు మ‌రింత‌గా త‌గ్గుతాయ‌నీ, చ‌లి గాలుల తీవ్రంగా కూడా పెరుగుతుంద‌ని భాత‌ర వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) అధికారులు పేర్కొంటున్నారు. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, తూర్పుగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అల్పపీడనం లేకపోవడం, ఉపరితల ఆవర్తనం లేకపోవడం, గాలులు, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ పలుచోట్ల పొడి వాతావరణం చూడా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అరకు, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు గుంటూరు, నరసరావుపేటలో పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా చలి, పొగ‌మంచు ఏపీలోని ప‌లు ప్రాంతాలు సుంద‌ర దృశ్యాల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే పాడేరు వంజంగి కొండలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. 

గుంటూరు, ప్రకాశం, ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లో సోమవారం రాత్రి ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో పొడిగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మంగళ, బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు దిగువ ట్రోపోస్పియర్ నుంచి తూర్పు, ఈశాన్య గాలులు రాష్ట్రంలోకి వీస్తున్నాయని, దీని కారణంగా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఒకటి, రెండు డిగ్రీల పతనంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రాయలసీమలో పలుచోట్ల సాధారణం కంటే 2-4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా, శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు , రాష్ట్రంలోనే అత్యల్పంగా కళింగపట్నంలో 16.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

తెలంగాణ‌లోనూ.. 

తెలంగాణ‌లోనూ ప‌లు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. చ‌లి తీవ్ర‌గా పెరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలలో ఆదివారం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్ మండలం కుమురం భీమ్, మంచిర్యాలలో జన్నారంలో వరుసగా 8, 8.7 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్ర‌త‌లు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్ర‌త‌లు గణనీయంగా పడిపోయాయి. రాబోయే 2 రోజుల్లో చలి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. అయితే,  తెలంగాణలో మొత్తంగా చూస్తే.. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీల సెల్సియస్‌, 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2-4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ రాష్ట్రంలోని ఉత్తర‌, మధ్య ప్రాంతాలకు పసుపు, నారింజ హెచ్చరికలను కూడా జారీ చేసింది.

click me!