ఆదోనీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 21, 2024, 9:46 PM IST
Highlights

భౌగోళికంగా, జనాభాపరంగా ఆదోనీని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్థాలుగా వుంది. ఇక్కడి ప్రజలు ఈ పట్ణణాన్ని రెండో ముంబైగా పిలుచుకుంటారు. కన్నడ రాజకీయాలు కూడా ఈ ప్రాంతంపై ప్రభావం చూపుతాయి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,57,640 మంది. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు. మీనాక్షి నాయుడు టీడీపీ నుంచి, వై సాయిప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి మూడేసి సార్లు గెలిచారు.  ఆదోనీ నుంచి నాలుగోసారి గెలవాలని సాయిప్రసాద్ రెడ్డి పట్టుదలగా వున్నారు. ఈసారి మాత్రం ఆదోనీలో పసుపు జెండా రెపరెపలాడేలా చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. మీనాక్షీ నాయుడును పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు.

వ్యాపారం, వాణిజ్యం , రాజకీయాలపరంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనీకి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం వుంది. ఇక్కడి ప్రజలు ఈ పట్ణణాన్ని రెండో ముంబైగా పిలుచుకుంటారు. ఇక్కడ వందలాది సంఖ్యలో ఆయిల్, పత్తి మిల్లులు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. భౌగోళికంగా, జనాభాపరంగా ఆదోనీని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్థాలుగా వుంది.

కర్నూలు జిల్లా కేంద్రానికి దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో వుండటంతో ప్రజలు అవసరాల కోసం అక్కడి వరకు వెళ్లడానికి వ్యయ ప్రయాసలకు గురయ్యేవారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోనీ, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు ప్రాంతాలు ఓ మూలకు విసిరేసినట్లు కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా వుంటాయి. కన్నడ రాజకీయాలు కూడా ఈ ప్రాంతంపై ప్రభావం చూపుతాయి. దీనికి తోడు కరువు ప్రాంతం కావడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఆదోనీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్ , టీడీపీల హవా :

రాజకీయాల విషయానికి వస్తే.. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,57,640 మంది. వీరిలో పురుషులు 1,27,903 మంది.. మహిళలు 1,29,688 మంది. ఆదోనీ పట్టణం, మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. పట్టణ, గ్రామీణ ప్రాంత ఓటర్ల సమ్మేళనంగా ఈ ప్రాంతం వుంటుంది. ఆదోనీ ప్రజలు అన్ని పార్టీలను , వర్గాలను అక్కున చేర్చుకున్నారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, స్వతంత్ర అభ్యర్ధులు ఇక్కడి నుంచి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు. మీనాక్షి నాయుడు టీడీపీ నుంచి, వై సాయిప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి మూడేసి సార్లు గెలిచారు. 

ఆదోనీ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. ఈసారి జెండా ఎగురవేయాలని టీడీపీ :

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి వై సాయిప్రసాద్ రెడ్డికి 74,109 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి కొంకా మీనాక్షీ నాయుడుకు 61,790 ఓట్లు పోలయ్యాయి. సాయిప్రసాద్ రెడ్డి 12,319 ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. 2024 ఎన్నికల విషయానికి వస్తే.. ఆదోనీ నుంచి  నాలుగోసారి గెలవాలని సాయిప్రసాద్ రెడ్డి పట్టుదలగా వున్నారు. సీఎం వైఎస్ జగన్ అన్ని రకాలుగా ఆయనకు అండదండలు అందిస్తున్నారు.

టీడీపీ విషయానికి వస్తే.. ఆదోనీ ఒకప్పుడు ఆ ప్రాంతానికి బాగా పట్టున్న ప్రాంతం. బీసీ జనాభా పెద్ద సంఖ్యలో వుండటంతో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో పాటు సాయిప్రసాద్ రెడ్డి వ్యూహాలు టీడీపీ కోటను బీటలు వారేలా చేశాయి. అయితే ఈసారి మాత్రం ఆదోనీలో పసుపు జెండా రెపరెపలాడేలా చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. మీనాక్షీ నాయుడును పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. వరుసగా రెండు సార్లు ఓడిపోయిన సానుభూతితో పాటు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తనకు కలిసొస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


 

click me!