పేరుకు పంచాయతీ కార్యదర్శి.. ఆస్తుల్లో అంబానీ.. కోట్లకు పడగలెత్తిన...

By AN TeluguFirst Published Apr 17, 2021, 11:21 AM IST
Highlights

శ్రీకాకుళం జిల్లాలో భారీ అవినీతి తిమింగళం ఏసీబీ వలలో చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులున్న పంచాయతీ కార్యదర్శిని అధికారులు వలవేసి పట్టుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో భారీ అవినీతి తిమింగళం ఏసీబీ వలలో చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులున్న పంచాయతీ కార్యదర్శిని అధికారులు వలవేసి పట్టుకున్నారు.

 శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శి రణస్థలం మండలం లో గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న వెంకటరావు ఇంటిపై శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని సమాచారం మేరకు అతనితోపాటు కుటుంబ సభ్యులు ఇళ్ళలో ఏకకాలంలో సోదాలు చేశారు.

శ్రీకాకుళంలో ఏసీబీ డీఎస్పీ డీవీఎస్‌ఎస్ రమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది శ్రీకాకుళం, విజయనగరంతో పాటు విశాఖలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో రూ.35,67,100 నగదు, రూ.17,65,373 విలువైన 669 గ్రాముల బంగారు ఆభరణాలు, విలువైన భూముల డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

శ్రీకాకుళం జిల్లా అరసాడ గ్రామానికి చెందిన ఆగూరు వెంకట్ రావు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా విధుల్లో చేరారు. అక్కడ నుంచి ప్రస్తుతం గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి గానే కాకుండా  ఇన్‌చార్జి ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

 ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో వారు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో శుక్రవారం ఉదయం 6:30 గంటలకు విజయనగరం, రాజాం, నెల్లిమర్ల ప్రాంతాల్లో ఉన్న వెంకట్రావు తో పాటు అతని కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విశాఖ లోని రామాటాకీస్ టౌన్ లోని  వెంకట్రావు నివాసంలో అధికారులు సోదాలు చేశారు.

ఈ క్రమంలో అక్రమ ఆస్తుల విలువ రెండు కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. అయితే అతని ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ ధర సుమారు 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఈ దాడుల్లో ఏసీబీ సీఐ భాస్కర్ రావు, హరి, మహేష్, ఎస్సై చిన్నంనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఆగూరు వెంకట్రావును అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ డీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి తెలిపారు. అతన్ని ఏసీబీ కోర్టులో హాజరు పరచి, రిమాండ్ కు తరలిస్తామన్నారు. 

click me!