దివిసీమలో స్వైన్‌ఫ్లూ కలకలం.. గ్రామాన్ని వెలేసిన పక్కగ్రామాలు

By sivanagaprasad kodatiFirst Published Dec 9, 2018, 2:10 PM IST
Highlights

నిన్న మొన్నటి వరకు వరుస పాముకాట్లతో వణికిపోయిన కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతం ఇప్పుడు స్వైన్‌ఫ్లూతో ఆందోళనకు గురవుతోంది. కోడూరు మండలం చింతకోళ్ల గ్రామానికి చెందిన పేరే నాంచారయ్య, పేరే మరియమ్మ అనే ఇద్దరు వరుసగా స్వైన్ ఫ్లూతో మరణించారు. 

దీంతో చింతకోళ్ల గ్రామం అంతటా స్వైన్ ఫ్లూ వ్యాపించిందని, ఇది గ్రామానికి ముప్పు అంటూ పుకార్లు మొదలయ్యాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పరిసర గ్రామాలకు పాకడంతో ఆయా వూరి గ్రామస్తులు చింతకోళ్ల జనాన్ని కలవడం, వారితో మాట్లాడటం, అటుగా వెళ్లడమే మానేశారు. వ్యాధి భయంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి.

ఆ గ్రామానికి స్కూల్ బస్సులు రావని, కొన్ని రోజుల వరకు చింతకోళ్లకు చెందిన విద్యార్ధులు పాఠశాలకు రావొద్దంటూ ప్రిన్సిపాల్ స్వయంగా చెప్పినట్లు ఆ వూరి ప్రజలు తెలిపారు. అంతటితో ఆగకుండా.. గ్రామానికి పాలు పోయడానికి వచ్చే వారు కూడా రావడం మానేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

చింతకోళ్ల గ్రామానికి వెళ్లొద్దంటూ కొందరు మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. దీంతో తాము అన్ని విధాలుగా సాంఘిక బహిష్కరణకు గురయ్యామని... ప్రభుత్వం ఈ ఆపద నుంచి కాపాడాలంటూ చింతకోళ్ల ప్రజలు కోరుతున్నారు.
 
click me!