గుంటూరులో కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ

By narsimha lodeFirst Published Sep 5, 2019, 11:23 AM IST
Highlights

74 ఏళ్ల వయస్సులో ఓ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. గుంటూరులోని ఓ నర్సింగ్‌హోమ్‌లో సిజేరియన్ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

గుంటూరు:74 ఏళ్ల వయస్సులో ఓ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. గుంటూరులోని ఓ నర్సింగ్‌హోమ్‌లో సిజేరియన్ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

ఐవీఎఫ్ విధానం ద్వారా  74 ఏళ్ల వయస్సులో మంగాయమ్మ వృద్దురాలు గర్భం దాల్చింది.  గురువారం నాడు గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ వృద్దురాలు కవలలకు జన్మనిచ్చింది.

తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962 మార్చి 22న వివాహమైంది.  పెళ్లైనా ఇంతవరకు ఆ దంపతులకు పిల్లలు పుట్టలేదు.

 

ఓ మహిళ 55 ఏళ్ల వయస్సులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి అయ్యారు. ఈ విషయం తెలుసుకొన్న మంగాయమ్మ ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భం దాల్చాలని నిర్ణయం తీసుకొన్నారు.

గుంటూరుకు చెందిన ప్రైవేట్ ఆసుపత్రిలో  ఐవీఎఫ్ నిపుణురాలు డాక్టర్ శనక్కాయల అరుణ ఉమాశంకర్ ను కలిశారు. మంగాయమ్మకు మెనోపాజ్ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుండి అండాన్ని మంగాయమ్మ భర్త నుండి వీర్యాన్ని సేకరించి ఐవీఎఫ్ పద్దతిలో కృత్రిమంగా గర్భం దాల్చేలా చేశారు.

నెలలు నిండడంతో సెప్టెంబర్ 5వ తేదీన ఉదయం 10:30 గంటలకు సిజేరియన్ చేశారు. మంగాయమ్మ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.ఇవాళ నిర్వహించిన సిజేరియన్ లో ఇద్దరు గైనకాలజిస్టులు, ఇద్దరు శిశు వైద్య నిపుణులు, ఇద్దరు కార్డియాలజీ విభాగం నిపుణులు పాల్గొన్నారు.

గతంలో భారతదేశంలో 70 ఏళ్ల మహిళ తల్లైందని డాక్టర్‌ ఉమాశంకర్‌ తెలిపారు. ఆమె పేరు దల్జీందర్‌ కౌర్‌. రాజస్థాన్‌కు చెందిన దల్జీందర్‌, మొహిందర్‌ సింగ్‌ . ఆమె కూడా ఐవీఎఫ్‌ విధానాన్ని ఆశ్రయించారు. 2016 ఏప్రిల్‌ 19న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

ఆస్పత్రి రికార్డుల ప్రకారం ఆమె వయసు 72 సంవత్సరాలు. అప్పట్లోనే అది ప్రపంచ రికార్డు అన్నారు. ఈ రికార్డును మంగాయమ్మ బద్దలు కొట్టారు. 74 ఏళ్ల వయస్సులో మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించినట్టుగా డాక్టర్ ఉమాశంకర్ చెప్పారు. ఇది ప్రపంచ రికార్డుగా వైద్యులు చెబుతున్నారు.

 

click me!