Nandyala Road Accident: పెళ్లి బృందం లారీ బోల్తా... ఇద్దరు దుర్మరణం, 11మందికి గాయాలు

Arun Kumar P   | Asianet News
Published : May 13, 2022, 09:44 AM ISTUpdated : May 13, 2022, 10:01 AM IST
Nandyala Road Accident: పెళ్లి బృందం లారీ బోల్తా... ఇద్దరు దుర్మరణం, 11మందికి గాయాలు

సారాంశం

పెళ్లి బృందం లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో ఇద్దరు దుర్మరణం చెందగా 11మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. ఈ ఘోరం నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

నంద్యాల: పెళ్లి బృందం ప్రయాణిస్తున్న మినీ  లారీ ఘోర రోడ్డుప్రమాదానికి గురయిన దుర్ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.   లారీ మంచి వేగంతో దూసుకెళుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆనందోత్సాహాల మధ్య వివాహానికి హాజరయ్యేందుకు బయలుదేరిన వారిలో కొందరు ప్రాణాలనే కోల్పోగా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ పాలయ్యారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొండజూటూరు గ్రామానికి చెందిన పెళ్లిబృందం పాములపాడు మండలం చలిమెల గ్రామంలో జరిగే వివాహానికి  బయలుదేరింది. అయితే వీరు ప్రయాణిస్తున్న మినీ లారీ పోలూరు గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. లారీ వేగంగా దూసుకువెళుతుండగా ఒక్కసారిగా గొర్రెల మంద అడ్డువచ్చింది. దీంతో డ్రైవర్ మందను తప్పించడానికి ప్రయత్నించగా లారీ అదుపుతప్పి బోల్తా పడింది. 

ఈ ప్రమాదంలో వెంకటయ్య(48) అక్కడిక్కడే మృతిచెందగా గజ్జెల ప్రసాద్ (65) తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో పదకొండుమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు లారీ కింద చిక్కుకున్న క్షతగాత్రులను కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నంద్యాల పట్టణ శివారులోని శాంతిరాం హాస్పిటల్ కు తరలించారు. మరికొందరిని   జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపప్తు చేపట్టారు. 

పెళ్లి బృందం లారీ ప్రమాదంగురించి తెలిసిన వెంటనే నంద్యాల ఇంచార్జి డీఎస్పీ రామాంజి నాయక్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అలాగే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో కూడా ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయి 15మంది ప్రయాణికులు గాయపడ్డారు. కర్ణాటకలోని హుబ్లీ నుండి తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు 45మంది ప్రమాణికులతో ఆరెంట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. ప్రయాణికులంతా నిద్రలో వుండగా ఒక్కసారిగా బస్సు ప్రమాదానికి గురయ్యింది. రహదారిపై మంచి వేగంతో దూసుకెళుతున్న బస్సు నారాయణపేట జిల్లాలో ఒక్కసారిగా ప్రమాదానికి గురయ్యింది. మాగనూరు వద్ద బస్ కు సడన్ గా ఓ గేదె అడ్డుగా వచ్చింది. డ్రైవర్ దాన్ని తప్పించడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. 

ఈ బస్సు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మిగతావారు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు మహబూబానగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నామని... ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!