Asianet News TeluguAsianet News Telugu

సంతానం ఇద్దరు దాటితే ఉద్యోగానికి అనర్హులు

రాష్ట్రంలో జనాభా నియంత్రణకు సంబంధించి అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించింది. ఈ నిబంధనలు జనవరి 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. 

No govt jobs in assam for people have more than two children
Author
Assam, First Published Oct 22, 2019, 5:20 PM IST

రాష్ట్రంలో జనాభా నియంత్రణకు సంబంధించి అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించింది.

సోమవారం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు జనవరి 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.

ఉద్యోగాల్లో ఇద్దరు పిల్లల నిబంధనకు సంబంధించి అసోం జనాభా, మహిళా సాధికారిత విధానం పేరిట అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం 2017లోనే ఆమోదం పొందింది. దీనితో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని నిరుపేదలకు మూడు బిగాల భూమిని ఇవ్వాలని.. ఇంటి నిర్మాణం కోసం సగం బిగా భూమిని ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది.

Also Read: జస్ట్ 8 ఇయర్స్: జనాభాలో చైనాను క్రాస్ చేయనున్న ఇండియా

ప్రభుత్వం ఇచ్చే భూమిని 15 సంవత్సరాల వరకు విక్రయించే అవకాశం ఉండదని తెలిపింది. అలాగే రాష్ట్రంలో బస్సు ఛార్జీలను 25 శాతం పెంచాలని నిర్ణయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

2030 నాటికి భారతదేశ జనాభా చైనాను మించిపోతుందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో దేశంలో విపరీతంగా పెరుగుతున్న జనాభాను నియంత్రించాలని అనేక అధ్యయనాలు, సర్వేలు ప్రతిరోజూ వెలువడుతూనే ఉన్నాయి.

కానీ ప్రభుత్వాలు మాత్రం జనాభా నియంత్రణను పట్టించుకోలేదు. అయితే ఇందిరా గాంధీ హయాంలో ఆమె తనయుడు సంజయ్ గాంధీ జనాభా విస్ఫోటనం గురించి ఆలోచించారు. వెంటనే రంగంలోకి దిగి.. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు.

దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగడంతో పాటు.. విమర్శలు రేగాయి. అప్పటి నుంచి ఏ కేంద్రప్రభుత్వం కూడా జనాభా నియంత్రణ గురించి పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోడీ  జనాభా నియంత్రణ గురించి  ప్రస్తావించారు. దేశ జనాభా విపరీతంగా పెరుగుతోందని... ఇది భవిష్యత్ తరాలను సంక్షోభంలోకి నెడుతుందని మోడీ వ్యాఖ్యానించారు.

ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తూ... బిడ్డ పుట్టక ముందే వారి గురించి బాగా ఆలోచించాలని, నాకు పుట్టబోయే బిడ్డకు నేను న్యాయం చేయగలనా అనే ఆలోచన వచ్చినప్పుడు కుటుంబాన్ని పరిమితం చేసుకుంటారన్నారు.

విద్యావంతులైన తల్లిదండ్రులు అలాగే ఆలోచిస్తారని.. ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకునే ప్రజలు ఈ దేశంలో ఉన్నారని అంగీకరించాలన్నారు.  

వచ్చే ఎనిమిదేళ్లలో చైనాను దాటేసి భారత్ అత్యధిక జనాభా గల దేశంగా నిలుస్తుందని తెలిపింది. అప్పటి నుంచి దశాబ్ధం చివరి వరకు అత్యధిక జనాభా గల దేశంగా భారత్ కొనసాగనుందని...2019 నుంచి 2050 మధ్య దేశ జనాభా మరో 27.3 కోట్లు పెరిగే అవకాశముందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

రానున్న 30 ఏళ్లలో భారత్‌తో పాటు నైజీరియా, పాకిస్తాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఇథియోపియా, టాంజానియా, ఇండోనేషియా, ఈజిప్టు అమెరికాలో జనాభా పెరుగుదల అత్యధికంగా ఉండనుందని నివేదిక తెలిపింది.

Also Read: జనాభా విస్ఫోటనం: సంజయ్ బాటలో మోడీ.. ఇక కీలక చర్యలేనా..?

ప్రపంచ జనాభా పెరుగుదలలో కేవలం 9 దేశాల్లోనే నమోదవుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. కాగా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనా అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది.

143 కోట్ల మందితో చైనా, 137 కోట్లతో భారత్ రెండో స్థానంలో, 32.9 కోట్లతో అమెరికా నాలుగు, 27.1 కోట్ల మందితో ఇండోనేషియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2050 తర్వాత భారత్ అగ్రస్థానంలో చైనా, నైజీరియా, అమెరికా, పాక్ జనాభాలో టాప్‌-5లో ఉంటాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.  

Follow Us:
Download App:
  • android
  • ios