ఫస్ట్ పీరియడ్స్ రక్తం చూసి.. ఎవరితోనో సెక్స్ లో పాల్గొందనే అనుమానంతో చెల్లెలిని హతమార్చిన అన్న..
రుతుస్రావంపై అవగాహన లేమి ఓ ప్రాణం పోయేందుకు కారణం అయ్యింది. 12 ఏళ్ల బాలికకు రుతుస్రావం మొదలవడంతో బట్టలకు రక్తపు మరకలు అంటుకున్నాయి. దీనిని తప్పుగా అర్థం చేసుకున్న ఆ బాలిక సోదరుడు ఆమెను చిత్రహింసలు పెట్టాడు. దీంతో బాలిక మరణించింది.
మహారాష్ట్రలో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలిక కు మొదటి సారిగా పీరియడ్స్ వచ్చాయి. ఆ రక్త స్రావానికి సంబంధించిన మరకలు చూసి ఆ బాలిక సోదరుడు పొరపాటు పడ్డాడు. తన సోదరి ఎవరితోనో శారీరక సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. కోపంతో బాలికపై దాడి చేశాడు. దీంతో బాధితురాలు చనిపోయింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
‘టైమ్స్ నౌ’ కథనం ప్రకారం.. థానేలోని ఉల్హాస్ నగర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల యువకుడు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడు తన 12 ఏళ్ల సోదరి, దాదాపు అదే వయస్సు ఉన్న మరదలితో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే ఇటీవల అతడి సోదరికి రుతుస్రావం ప్రారంభమైంది. రక్తస్రావం కావడంతో బాలిక బట్టలపై రక్తపు మరకలు అంటుకున్నాయి. ఇది గమనించిన నిందితుడు ఇదేంటని బాలికను ప్రశ్నించాడు.
ఎంఎస్ ధోనీ తమిళనాడు దత్తపుత్రుడు.. ఆయనకు నేను పెద్ద అభిమాని - సీఎం ఎంకే స్టాలిన్
అయితే ఇంట్లో పెద్ద వయస్సు ఉన్న ఇతర మహిళలు ఎవరూ లేకపోవడం, బాలికల ఇద్దరి వయస్సు తక్కువే కావడంతో వారికి ఈ రుతుస్రావంపై అవగాహన లేదు. దీంతో బాలికలకు సాధారణంగా ఎదురయ్యే ఈ పరిస్థితిని అతడికి వివరించలేకపోయారు. అయితే చెల్లెలు ఏ విషయమూ చెప్పకపోవడంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన సోదరి ఎవరితోనో శృంగారంలో పాల్గొందని ఆరోపించాడు.
కోపోద్రిక్తుడైన నిందితుడు బాలిక నోరు, వీపు, శరీరంలోని ఇతర భాగాలపై తూటాలతో కాల్చాడు. అనంతరం బాధితురాలిని హాస్పిటల్ కు తరలించారు. కానీ ఆమె అప్పటికే మరణించిందని డాక్టర్లు నిర్ధారించారు. ఉల్హాస్ నగర్ పోలీస్ స్టేషన్ లో యువకుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.