ICC World Cup Final 2023: కంగారూ జట్టుపై కాసుల వర్షం.. విన్నర్ కి ప్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా..?

By Rajesh KarampooriFirst Published Nov 20, 2023, 1:39 AM IST
Highlights

ICC World Cup Final 2023: భారత్‌ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరోసారి విశ్వవిజేతగా అవతరించింది. టీమిండియా సొంత గడ్డపై మట్టి కరిపించింది. ఎనిమిదేళ్ల తర్వాత చాంపియన్‌గా నిలిచిన కంగారూ జట్టుపై కాసుల వర్షం కురిసింది..  

ICC World Cup Final 2023: ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఛాంపియన్‌గా నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియా 1987, 1999, 2003, 2007,  2015లో టైటిల్‌ను గెలుచుకుంది.

తాజా టోర్నీలో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుపై కాసుల వర్షం కురిసింది. కంగారూ జట్టు 4 మిలియన్ అమెరికన్ డాలర్లను అందుకుంది. మన కరెన్సీ ప్రకారం.. రూ.33.31 కోట్లు. అదే సమయంలో రన్నరప్ గా నిలిచిన  భారత జట్టు 2 మిలియన్ యూఎస్ డాలర్ల(రూ.16.65 కోట్లు) తో సంతృప్తి చెందాల్సి వచ్చింది. 

టోర్నీ ప్రారంభానికి ముందే ఐసీసీ ప్రైజ్ మనీని ప్రకటించింది. ఇది టోర్నమెంట్ కోసం ప్రైజ్ మనీని రూ. 83.29 కోట్లు (US$10 మిలియన్లు)గా కేటాయించింది ఐసీసీ. ఇందులో విజేత జట్టుకు రూ. 33.31 కోట్లు (4 మిలియన్ అమెరికన్ డాలర్లు), ఫైనల్లో ఓడిన జట్టుకు రూ.16.65 కోట్లు (2 మిలియన్ యూఎస్ డాలర్లు) అందిస్తామని ప్రకటించింది.

అదే సమయంలో సెమీఫైనల్స్, గ్రూప్ రౌండ్లలో ఓడిన జట్లకు కూడా ఫ్రైజ్ మనీని ప్రకటించింది ఐసీసీ. సెమీ-ఫైనల్స్‌లో ఓడిన జట్లకు రూ. 6.66 కోట్లు (US$800,000) ఇస్తామని ప్రకటించింది. సెమీస్‌లో ఓటమి చవిచూడాల్సిన  దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లకు చేరో రూ. 6.66 కోట్లు వచ్చాయన్న మాట. అదే సమయంలో గ్రూప్ రౌండ్‌లో నిష్క్రమించిన ఆరు జట్లు, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌లకు కూడా ఫ్రైజ్ మనీ ప్రకటించింది.ఈ ఆరు జట్లకు చేరో రూ. 83.29 లక్షలు (US$100,000) లభించాయి.

ఫైనల్ మ్యాచ్‌లో ఏం జరిగింది?

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాశుభారంభం దక్కలేదు.శుభ్‌మన్ గిల్‌ను ముందుగానే అవుట్ చేసిన తర్వాత, రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతడు ఎక్కువ సేపు మైదానం ఉండలేకపోయారు. 47 పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. ఆ తరువాత వచ్చిన కోహ్లీ(54), కేఎల్ రాహుల్ (66) చేసి అవుట్ అయ్యారు. కీలక మ్యాచ్‌లో గిల్, శ్రేయాస్, సూర్యకుమార్ లు చేతులెత్తేశారు. దీంతో టీమిండియా 240 పరుగులకే కుప్పకూలింది. 

అనంతరం లక్ష్య చేధనకు వచ్చిన ఆసీస్ బ్యాటర్లు మొదట తడబడ్డారు. వార్నర్, స్మిత్, మార్ష్ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు వెనువెంటనే పడటంతో టీమిండియా అభిమానుల్లో ఆశ చిగురించింది. ఈ సారి కప్ మనదే అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, ఆసీస్ బ్యాటర్లు హెడ్(141), లబుషేన్‌లు(58) పరుగులతో అద్భుతంగా రాణించారు.  కేవలం 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. 

ఈ విజయంతో ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అదే సమయంలో మూడోసారి ట్రోఫీని చేజిక్కించుకోవాలన్న భారత్ కల చెదిరిపోయింది. టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచినా రోహిత్ సేన 11వ మ్యాచ్‌లో వెనుకబడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ రెండోసారి ఓటమిని చవిచూసింది. రికీ పాంటింగ్ సారథ్యంలోని జట్టు చివరిసారిగా 2003లో ఓడిపోయింది.

click me!