Nov 13, 2019, 7:47 PM IST
కర్నూల్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ లో ఓ రైతు భూవివాదం విషయంలో ఎమ్మార్వోను అతిదారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత రెవెన్యూ అధికారుల్లో గుబులు మొదలవగా... లంచాలతో వేధించబడిన అన్నదాతలు, బాధితుల్లో తెగింపు వచ్చింది. దీంతో రెవెన్యూ సిబ్బందిని తమ సమస్యల పరిష్కారంపై తీవ్రంగా నిలదీయడమే కాదు కార్యాలయాలకు పెట్రోల్ బాటిల్స్ తో ప్రవేశిస్తున్నారు. అలాంటి ఘటనే కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆళ్లగడ్డ ఎమ్మార్వో ఆఫీస్ కి ఓ మహిళా రైతు పెట్రోల్ బాటిల్ తో రావడం కలకలం సృష్టించింది. గత ఏడాదికాలంగా తమ సమస్య పరిష్కారం చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదనతోనే ఇలా పెట్రోల్ బాటిల్ తో వచ్చిన బాధిత మహిళ తెలిపింది. ఆత్మహత్య చేసుకోడానికే ఇలా పెట్రోల్ పు వెంట తీసుకు వచ్చినట్లు ఆమె తెలిపింది. విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో తహసిల్దార్ మాట్లాడించే ప్రయత్నం చేశారు.