అక్కడే మొదలెట్టా! అదే ఆఖరు... రిటైర్మెంట్‌పై సానియా మీర్జా ఎమోషనల్ నోట్...

By Chinthakindhi Ramu  |  First Published Jan 13, 2023, 6:54 PM IST

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 టోర్నీతో రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు ప్రకటించిన సానియా మీర్జా... రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా మీర్జా.. 


భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంట్ గురించి కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 2022 సీజన్‌తోనే టెన్నిస్ కెరీర్‌కి ముగింపు పలకబోతున్నట్టు గత ఏడాదిలో ప్రకటించిన సానియా మీర్జా, గాయంతో ఆ ఆలోచనను విరమించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్ ఓపెన్‌ 2023 టోర్నీ సానియా మీర్జా కెరీర్‌కి ఆఖరిది అవుతుందని వార్తలు వినిపించాయి...

అయితే దాని కంటే ముందే ఆస్ట్రేలియా ఓపెన్‌ 2023 తోనే రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది సానియా మీర్జా..  ‘30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌, నాజర్ స్కూల్‌లో ఉన్న  ఆరేళ్ల చిన్నారి పట్టుకుని వాళ్ల అమ్మ నిజాం క్లబ్‌లో అడుగుపెట్టింది. తమ కూతురికి టెన్నిస్ నేర్పించమని కోచ్‌ని కోరింది. అయితే ఇంత చిన్న వయసులో టెన్నిస్ అవసరమా? ఆ కోచ్ అనుకున్నాడు. 

Life update :) pic.twitter.com/bZhM89GXga

— Sania Mirza (@MirzaSania)

Latest Videos

undefined

ఆ పాప మాత్రం ఆరేళ్ల వయసులోనే తన కలల కోసం పోరాడడం మొదలెట్టింది. ఎన్నో కష్టాలు, మరెన్నో సమస్యలు, ఇబ్బందులను అధిగమించి కెరీర్‌లో మొదటి గ్రామ్ స్లామ్ ఆడింది. దేశానికి ప్రాతినిథ్యం వహించే అతి గొప్ప గౌరవాన్ని పొందింది..

ఇప్పుడు నా కెరీర్‌ని వెనక్కి తిరిగి చూసుకుంటే 50 గ్రాండ్ స్లామ్స్‌పైగా ఆడేశాను, వాటిల్లో కొన్ని టైటిల్స్ కూడా గెలిచాను. పొడియంలో త్రివర్ణ పతాకంతో నిలబడడమే నాకు దక్కిన అత్యున్నత గౌరవం. టెన్నిస్ ఆట ప్రపంచవ్యాప్తంగా నాకు అభిమానులను సంపాదించిపెట్టింది...

నా రిటైర్మెంట్ లేఖ రాస్తున్నప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి, గర్వంతో నా మనసు ఉప్పొంగుతోంది. నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ అమ్మాయి, టెన్నిస్ ప్రపంచంలో ఎన్నో అఖండ విజయాలు అందుకోగలిగిందంటే అంత తేలికైన విషయం కాదు.. నా కల సాకరం అవ్వడంలో తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా...

20 ఏళ్లుగా ప్రొఫెషనల్ అథ్లెట్‌గా ఉన్నా, 30 ఏళ్లుగా టెన్నిస్ ఆడుతున్నా. నా జీవితమే టెన్నిస్ అయిపోయింది. నా గ్రాండ్ స్లామ్ జర్నీని 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో మొదలెట్టా., అందుకే అక్కడే ముగించడం సమంజమని భావిస్తున్నా...’ అంటూ రాసుకొచ్చింది సానియా మీర్జా.. 

2003లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన సానియా... 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కి ముగింపు పలకనుంది. తన కెరీర్‌లో ఆరు సార్లు డబుల్స్ మేజర్ టైటిల్స్ గెలిచిన సానియా మీర్జా, రెండు దశాబ్దాలుగా ఇండియా టాప్ సీడెడ్ ప్లేయర్‌గా కొనసాగింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో వుమెన్స్ సింగిల్స్‌లో రజతం గెలిచిన సానియా మీర్జా... గత ఏడాది చివర్లోనే రిటైర్మెంట్ గురించి ప్రకటన చేసింది...

అయితే గాయంతో యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సానియా మీర్జా, 2023 ఆస్ట్రేలియా ఓపెన్‌లో రోహాన్ బోపన్నతో కలిసి బరిలో దిగబోతోంది.  

ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్స్‌లో వుమెన్స్ డబుల్స్ టైటిల్స్ గెలిచిన సానియా మీర్జా, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించింది.  కెరీర్‌లో‌ ఎన్నో విమర్శలు, అంతకుమించి ఆరోపణలు వచ్చినా... వివాదాలు వెంటాడినా అన్నింటినీ ఒంటరిగా ఎదుర్కొంది సానియా మీర్జా... 

ఒలింపిక్స్ మెడల్ గెలవాలనే కలను నెరవేర్చుకోవాలనే ఆశతో టోక్యోలో అడుగుపెట్టిన సానియా మీర్జా, రెండో రౌండ్‌లో ఓడి ఇంటి దారి పట్టింది. అయితే ఆ తర్వాత చార్లెస్‌స్టన్ ఓపెన్ 2022 టోర్నీలో ఆడిన సానియా మీర్జా, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ లూసీ హ్రాడెస్కాతో కలిసి ఫైనల్ చేరి, వుమెన్స్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది...

 సింగిల్స్‌లో అత్యధికంగా 27వ ర్యాంకుకి చేరుకున్న సానియా మీర్జా, డబుల్స్‌లో 2015లో వరల్డ్ నెం.1 ర్యాంకును పొందింది... 

click me!