నాగల్ ఆటతీరు అద్భుతం... గాలివాటం ప్రదర్శన కాదు: ఫెదరర్ ప్రశంసలు

By Arun Kumar PFirst Published Aug 27, 2019, 8:53 PM IST
Highlights

భారత టెన్నిస్ సంచలనం సుమిత్ నాగల్ పై స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రశంసలు కురిపించాడు. అతడికి టెన్నిస్ క్రీడాకారుడిగా మంచి కెరీర్ వుందని అన్నాడు.  

సుమిత్ నాగల్... ఈ  హర్యానా బ్యడ్మింటన్ క్రీడాకారుడి పేరు నిన్నటివరకు ఎవ్వరికీ తెలీదు. కానీ రాత్రికి రాత్రి అతడు స్టార్ గా మారిపోయాడు. ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ లో అతడు స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. తన దూకుడు ఆటతో ఫెదరర్ ను ఏకంగా మొదటి సెట్లో 6-4 తేడాతో ఓడించాడు. ఆ తర్వాత ఫెదరర్ పుంజుకుని వరుస సెట్లలో 6-1,6-2,6-4 తేడాతో పైచేయి సాధించాడు. అయితే మొదటి సెట్లో గెలిచి ఫెదరర్ వంటి టెన్నిస్ దిగ్గజాన్ని బెంబేలెత్తించిన నాగల్ పై యావత్ క్రీడా ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. ఈ ఒక్క సెట్ గెలుపే అతన్ని హీరోని చేసింది. 

అయితే కొందరు మాత్రం నాగల్ ది గాలివాటం గెలుపంటూ...అతడికి అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లను గెలిచే సత్తా లేదని విమర్శిస్తున్నారు. నిజంగా అతడు అంత గొప్ప ఆటగాడే అయితే మిగిలిన సెట్లను గెలిచి ఫెదరర్ ను ఓడించేవాడు. కేవలం ఒక్కసెట్లో  గెలిచిన ఆటగాడికి ఈ స్థాయిలో బ్రహ్మరథం పట్టడం ఏంటని విమర్శిస్తున్నారు. అలాంటి  విమర్శకులకు స్వయంగా రోజర్ ఫెదరరే అదిరిపోయే సమాధానం చెప్పారు. 

''ఎలా ఆడితే ఏం సాధిస్తామో అతడికి(నాగల్ కు)తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి కెరీర్ ను బాగా నిర్మించుకుంటూ టెన్నిస్ లో అద్భుతాలు  చేయగలడని భావిస్తున్నా. టెన్నిస్ అనేది అప్పటికప్పుడు సర్‌ప్రైజ్ ప్రదర్శన చేసే ఆట కాదు. ఎంతో కఠోర శ్రమ  వుంటే తప్ప ఈ స్థాయి ప్రదర్శన చేయలేం. అతడెంతో నిలకడగా ఆడాడు. ఈ రాత్రి నాగల్ ఆట అద్భుతంగా సాగింది.

ఆటగాడు తన అత్యుత్తమ ప్రదర్శనను ప్రదర్శిచాడంటే అది అంత సులువు కాదు. దేనికోసమైతే జీవితం అంకితం అనుకుంటామో, కలలు కంటామో అలాంటి పెద్ద టోర్నమెంట్లలో అది మరింత  కష్టం. ఆ సమయంలో తీవ్రమైన ఒత్తిడి వుంటుంది. కాబట్టి నాగల్ ఈ టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాడు కాబట్టి అతడికి మంచి కెరీర్ వుందని చెప్పగలుగుతున్నా. ''  అంటూ సుమిత్ నాగల్ పై ఫెదరర్ ప్రశంసలు కురిపించాడు. 
 

click me!