జియో స్పీడ్‌కు బ్రేక్... దూకుడు పెంచిన ఎయిర్‌టెల్

By Arun Kumar PFirst Published Jan 16, 2019, 11:57 AM IST
Highlights

నవంబర్ నెలతో పోలిస్తే గత నెలలో 4జీ డేటా డౌన్‌లోడ్‌లో రిలయన్స్ జియో స్పీడ్ ఎనిమిది శాతం తగ్గి 18.7 ఎంబీపీఎస్‌గా నమోదైంది. కానీ భారతీ ఎయిర్ టెల్ ఇటు డౌన్‌లోడ్.. అటు అప్‌లోడ్‌లోనూ స్వల్పంగా పురోగతి నమోదు చేసింది. ఇక అప్ లోడ్ లోనూ ఐడియానే మళ్లీ టాప్‌లో నిలిచింది. 

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో డౌన్ లోడ్ స్పీడ్ తగ్గింది. ఈ సంగతి స్వయంగా టెలికం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్వయంగా తెలిపింది. అయితే రిలయన్స్‌ జియో 4జీలో గత నెల డేటా డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ఎనిమిది శాతం తగ్గి 18.7 మెగాబైట్‌ పర్‌ సెకండ్‌(ఎంబీపీఎస్‌)గా నమోదైందని ట్రాయ్‌ పేర్కొంది. 

జియో డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో క్షీణత ఉన్నా, ప్రస్తుత టెలికాం నెట్‌వర్క్‌లలో జియోదే టాప్‌ అని తెలిపింది. గత 12నెలల్లోనూ జియోనే అగ్ర స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. గతేడాది నవంబర్ నెలలో జియో సగటు డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 20.3ఎంబీపీఎస్‌గా ఉండగా, డిసెంబర్‌లో అది 18.7 ఎంబీపీఎస్‌కు పడిపోయింది.

మరోపక్క భారతీ ఎయిర్‌టెల్‌ 4జీ నెట్‌వర్క్‌ వేగం కాస్త పెరిగింది. నవంబర్ 9.7ఎంబీపీఎస్‌గా ఉన్న ఎయిర్‌టెల్‌ నెట్‌ సగటు వేగం..గత నెలలో 9.8ఎంబీపీఎస్‌గా నమోదైనట్లు మై స్పీడ్‌ పోర్టల్‌లో ట్రాయ్‌ తెలిపింది. అదే విధంగా వొడాఫోన్‌-ఐడియా విలీనం తర్వాత వొడాఫోన్‌ ఐడియా పేరుతో నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

కాగా, డిసెంబర్ నెలలో వొడాఫోన్ డౌన్‌లోడ్‌ వేగం 6.8ఎంబీపీఎస్‌ నుంచి 6.3ఎంబీపీఎస్‌కు పడిపోయింది. ఐడియా కూడా 6.2ఎంబీపీఎస్‌ నుంచి 6 ఎంబీపీఎస్‌కు తగ్గిందని ట్రాయ్‌ పేర్కొంది.

ఇక అప్‌లోడ్‌ స్పీడ్‌లోనూ క్షీణతను నమోదు చేసిన ఐడియా టాప్‌లోనే ఉండటం గమనార్హం. ఐడియా అప్‌లోడ్‌ వేగం నవంబర్ నెలలో 6.6ఎంబీపీఎస్‌గా ఉండగా, గతనెలలో అది 5.3ఎంబీపీఎస్‌కు తగ్గిపోయింది. 

ఆ తర్వాతీ స్థానంలో వొడాఫోన్‌ 5.1ఎంబీపీఎస్‌, జియో 4.3ఎంబీపీఎస్‌, ఎయిర్‌టెల్‌ 3.9ఎంబీపీఎస్‌ అప్‌లోడ్‌ స్పీడ్‌ను నమోదు చేసినట్లు ట్రాయ్‌ తెలిపింది. వీడియోలు చూసేందుకు, ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌కు డౌన్‌లోడ్‌ స్పీడ్‌ చాలా ముఖ్యం కాగా, ఫొటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్‌ చేయాలంటే అప్‌లోడ్‌ స్పీడ్‌ కీలకం. 

click me!