బయోపిక్‌ల హవా... తెలుగు ఐటీ దిగ్గజం జీవితంపై మరో సినిమా

By Arun Kumar PFirst Published Jan 17, 2019, 1:43 PM IST
Highlights

 ఐటీ రంగంలో పేరొందిన సెలబ్రిటీ ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి. ఆయన జీవిత చిత్రంపై ‘బయోపిక్’ రానున్నది. హిందీ చిత్ర నిర్మాత సంజయ్ త్రిపాఠికి దీనికి సారథ్యం వహించనున్నారు. వాస్తవాలను వక్రీకరించకుండా సినిమా తీయాలని త్రిపాఠికి మూర్తి షరతు విధించారని తెలుస్తోంది. ఇప్పటికైతే మూర్తి వద్ద 30 పేజీల స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నది. ఆయన అనుమతినిస్తే తదుపరి సినిమా చిత్రీకరణ దిశగా అడుగు ముందుకు పడినట్లే.

బెంగళూరు: భారతీయ ఐటీ దిగ్గజం.. సెలబ్రిటీ.. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి జీవిత చరిత్ర ఆధారంగా ‘బయోపిక్’ సినిమా రానున్నది. ఇప్పుడంతా సినీ, క్రీడా, పారిశ్రామిక రంగాలపై బయోపిక్ రాజ్యం నడుస్తున్న తరుణంలో భారతదేశంలో ఐటీ రంగ పునాదుల్లో ఇన్ఫోసిస్ కూడా ఒకటి. ఈ సంస్థ స్థాపనలో కష్టాలు, సాధక బాధకాలు వెలుగులోకి రానున్నాయి. 

ప్రత్యేకించి ఇన్ఫోసిస్ వ్యవస్థాపక టీం బయటకు వచ్చాక విశాల్ సిక్కా హయాంలో సంస్థ.. నారాయణమూర్తి ఎదుర్కొన్న సవాళ్లు, సమస్యలు వెలుగులోకి రానున్నాయి. హిందీ చలన చిత్ర రంగ నిర్మాత సంజయ్ త్రిపాఠి ఎనిమిది నెలల క్రితం తొలిసారి ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. తాజాగా స్క్రి ప్ట్ రూపకల్పనలో ఆయన బిజీబిజీగా ఉన్నారని తెలుస్తోంది.

ఎనిమిది నెలల క్రితం తొలిసారి ప్రస్తావించినా.. తదుపరి పలు దఫాలుగా సంజయ్ త్రిపాఠి చర్చలు జరిపి ‘నారాయణ మూర్తి’ ఆమోదం పొందారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే స్థూలంగా నారాయణ మూర్తి ఒక్క మాట చెప్పారట. వాస్తవాలను వక్రీకరించొద్దని సంజయ్ త్రిపాఠికి హితవు చెప్పారు.  తాజాగా మూర్తికి సంజయ్ త్రిపాఠి 30 పేజీల స్క్రిప్ట్ హిందీలోనూ, ఇంగ్లీష్‌లోనూ పంపారని వినికిడి. అన్ని సజావుగా సాగితే కొన్ని నెలల్లో సినిమా చిత్రీకరణ సెట్ పైకి రావచ్చునని సంబంధిత వర్గాల కథనం.

నారాయణమూర్తి తన భార్య సుధామూర్తి వద్ద రూ.10 వేల అప్పు తీసుకుని మరీ ఇన్ఫోసిస్ ప్రయాణాన్ని కొనసాగించిన విషయాన్ని అలాగే రానివ్వాలని కోరారని తెలుస్తున్నది. 1981 జూలైలో స్థాపించబడిన ఇన్ఫోసిస్.. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 10.94 బిలియన్ల డాలర్ల ఆదాయం సంపాదనతోపాటు భారతదేశాన్ని గ్లోబల్ సాఫ్ట్‌వేర్ మ్యాప్‌లో పెట్టడంలోనూ కీలకంగా ఉన్నది. 72వ పడిలో పడిన నారాయణమూర్తి ఆదాయం 2.3 బిలియన్ల డాలర్లని ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. 

అయితే ప్రస్తుతం నారాయణమూర్తి.. ఇన్ఫోసిస్ పూర్వాపరాలకు పుస్తకరూపం ఇవ్వడంలో నిమగ్నమయ్యారు. బయోపిక్ విషయమై వివిధ దినపత్రికలు పంపిన ఈమెయిల్స్ కు కూడా ఆయన స్పందించడం లేదు. ఒక స్కూల్ టీచర్ తనయుడైన నారాయణమూర్తి దక్షిణ కర్ణాటకలోని చిక్కాబల్లాపూర్‌లో జన్మించారు. కాన్ఫూర్ ఐఐటీలో విద్యాభ్యాసం చేసిన నారాయణమూర్తి.. పాట్నీ కంప్యూటర్స్ సిస్టమ్స్ సంస్థలో కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా పని చేశారు.

తన 35వ ఏటా పుణెలో ఇన్పోసిస్ స్థాపించారు. ఇంటి నుంచే సేవలు ప్రారంభించిన నారాయణమూర్తి 1981లో ఇన్ఫోసిస్ సీఈఓగా, 2002లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2011లో చైర్మన్‌గా వైదొలిగినా.. మళ్లీ 2013లో ఏడాది పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకేతర సీఈఓగా విశాల్ సిక్కా నియమితులయ్యే వరకు సంస్థ బాధ్యతలు నిర్వర్తించారు నారాయణమూర్తి. 

ఒక బిజినెస్‌మెన్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రావడం చాలా అరుదు. 2007లో రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబాజీ జీవిత చరిత్ర ఆధారంగా మణిరత్నం ‘గురు’ సినిమా నిర్మించారు. అయితే సంజయ్ త్రిపాఠి రాసిన స్క్రిప్ట్‌ను నారాయణమూర్తి ఖరారు చేస్తే షూటింగ్, నటుల ఎంపిక తదితర ప్రక్రియ చేపడతారు. దర్శకత్వం ఎవరు వహిస్తారు.. నారాయణమూర్తి పాత్ర పోషించేదెవరన్న సంగతి చర్చకు రావచ్చు. 

ఇన్ఫోసిస్ సీఈఓగా విశాల్ సిక్కా ఉన్నప్పుడు సంస్థలో ఇబ్బందులు సినిమాలో వస్తాయా? రావా? అన్నది స్పష్టత రాలేదు. విశాల్ సిక్కా తీసుకున్న కొన్ని నిర్ణయాలపై నారాయణమూర్తి అసంత్రుప్తితో ఉండేవారు. పలు నిర్ణయాలపై ప్రత్యేకించి కార్పొరేట్ గవర్నెన్స్ వైఫల్యంపై మూర్తి ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఫలితంగా విశాల్ సిక్కా వైదొలగడం.. సంస్థ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

సినిమా అంటేనే పాటలు, డ్యాన్సులు ఉంటాయి. కానీ సినిమా దర్శకత్వం, షూటింగ్ మొదలైన తర్వాత తేలనున్నది. నిరాడంబర జీవితం గడుపుతూ ముందుకు సాగిన ఒక వ్యక్తి జీవితం ఆధారంగా ‘ఇన్ఫోసిస్ నారాయణమూర్తి’ సినిమా రానున్నది. 
 

click me!