బడ్జెట్‌లో ‘ఏంజిల్’ టాక్స్ ఊసెత్తని కేంద్రం: నాస్కామ్

By narsimha lodeFirst Published Feb 3, 2019, 10:52 AM IST
Highlights

స్టార్టప్‌లతోపాటు ఐటీ సంస్థలపై విధిస్తున్న ‘ఏంజిల్’ టాక్స్ రద్దు చేయాలన్న తమ కీలక డిమాండ్‌పైనా కేంద్ర ప్రభుత్వం తన మధ్యంతర బడ్జెట్ లో ఊసెత్తలేదని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ పేర్కొంది.


న్యూఢిల్లీ: స్టార్టప్‌లతోపాటు ఐటీ సంస్థలపై విధిస్తున్న ‘ఏంజిల్’ టాక్స్ రద్దు చేయాలన్న తమ కీలక డిమాండ్‌పైనా కేంద్ర ప్రభుత్వం తన మధ్యంతర బడ్జెట్ లో ఊసెత్తలేదని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ పేర్కొంది. దీంతోపాటు కీలక అంశాలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని నాస్కామ్ ఆశాభావం వ్యక్తం చేసింది. 

విద్యారంగం, ఉద్యోగాలు, స్టార్టప్‌ల అభివ్రుద్ధిపై ఫోకస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతించింది. లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా మార్చాలన్న ప్రణాళిక, కస్టమ్స్ లావాదేవీలను సమగ్ర డిజిటలైజేషన్ చేయడం ద్వారా భారతదేశ యువతరం డిజిటల్ ఆకాంక్షల్లో ప్రేరణ కల్పించినందుకు సంతోషంగా ఉన్నదని నాస్కామ్ ఒక ప్రకటనలో పేర్కొంది.  

ఏంజిల్ టాక్స్ రద్దు చేయాలని వివిధ జీఎస్టీ శ్లాబులపై వివరణలు ఇవ్వాలని ఐటీ పరిశ్రమ పదేపదే కోరుతోంది. కానీ బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదు. దీన్ని సంప్రదింపుల ప్రక్రియ ద్వారా పరిష్కరించుకోవచ్చునని నాస్కామ్ ఆశాభావం వ్యక్తం చేసింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) అన్ని వాటాదారులతో సోమవారం సంప్రదింపులు జరుపనున్నది. ఈ సంప్రదింపుల్లో స్టార్టప్ లు, ఏంజిల్ ఇన్వెస్టర్లు కూడా పాల్గొని తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు లేవనెత్తనున్నారు. 

భారతదేశం అంతర్జాతీయంగా రెండో అతిపెద్ద స్టార్టప్‌ల హబ్‌గా నిలువనున్నది. కానీ స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులపై పన్ను రాయితీలపై ప్రభుత్వం ఊసెత్తక పోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నది. ఇతర సంస్థల కంటే, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కంటే అత్యధికంగా ఉద్యోగాలు కల్పించే వేదికలు స్టార్టప్‌లు మాత్రమే.

ఐదేళ్లలో లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం టెక్నాలజీ విస్తరణను మరో దశకు తీసుకెళ్లనున్నది. డిజిటల్ భారత్ నిర్మాణానికి తోడ్పాటునిస్తుందని ఇంటెల్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాశ్ మాల్య తెలిపారు. టీసీఎస్ సీఎఫ్ఓ వీ రామక్రుష్ణన్ మాట్లాడుతూ లక్ష డిజిటల్ గ్రామాల నిర్మాణంతో గ్రామాలకు డిజిటల్ పారిశ్రామీకరణ విస్తరిస్తుందన్నారు. 

ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) అధ్యక్షుడు సుభో రాయ్ స్పందిస్తూ డిజటల్ గ్రామాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించిన విజన్ ‘ఆంబిషియస్’గా ఉన్నదన్నారు. డిజిటల్ రివల్యూషన్ దిశగా, గ్రామాలు, పట్టణాల మధ్య డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించాల్సి ఉందన్నారు. కొత్తగా ఉద్యోగాల కల్పనకు వీలు కలిగిస్తుందన్నారు. 
 

click me!