భారత్ వంటి అభివ్రుద్ధి చెందుతున్న దేశాల కరెన్సీ ఒడిదొడుకులకు గురి కావడం వల్లే తమ ఐఫోన్ విక్రయాలు తగ్గుముఖం పట్టాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు. అయితే ఒకింత తమ ఫోన్ల ధరలు అధికమేనని కూడా అంగీకరించారు. ఆ మేరకు చైనా, భారత్ మార్కెట్లలో వాటి ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించారు.
ఎట్టకేలకు టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తమ ‘ఐఫోన్’ ధరలు కాసింత ఎక్కువగానే ఉన్నాయని అంగీకరించారు. దీనికి తోడు కొంతకాలంగా భారత్‌లో ఐ ఫోన్ విక్రయాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇందుకు కారణం ఉన్నదని యాపిల్ సీఈవో టీమ్ కుక్ చెబుతున్నారు.
కానీ ఆయన భారత్ పేరును నేరుగా ప్రస్తావించేందుకు సాహసించకున్నా.. డాలర్ విలువ, బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ తదితర అనేక కారణాలతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐఫోన్ విక్రయాలు పెరగట్లేదని కుక్ అభిప్రాయ పడ్డారు.
undefined
కంపెనీ ఆదాయ వ్యయాలపై కుక్ మంగళవారం మార్కెట్ విశ్లేషకులతో మాట్లాడారు. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐఫోన్ ఆదాయం 15శాతం తగ్గింది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి.. అమెరికా డాలర్ విలువ బలపడుతుండటం. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ విలువ పెరగడంతో మా ఉత్పత్తుల ధర పెరుగుతోంది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ధరల మోత ఎక్కువగా ఉంటోంది. దీంతో కస్టమర్లు ఐఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపించట్లేదు’ అని కుక్ చెప్పుకొచ్చారు. ఇక తమ కంపెనీ అందిస్తున్న బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ప్రొగ్రామ్ కూడా విక్రయాలు తగ్గడానికి ఒక కారణమని ఆయన అంటున్నారు.
‘లక్షల మంది కస్టమర్లకు మేం బ్యాటరీలను ఉచితంగా రీప్లేస్ చేస్తున్నాం. దీంతో కస్టమర్లు తమ పాత ఐఫోన్లను ఎక్కువ కాలం వాడుతున్నారు’ అని కుక్ వివరించారు. విక్రయాలు పెంచేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని కుక్ తెలిపారు. చైనాలో ఐఫోన్ ధరలు తగ్గించామని, భారత్‌లోనూ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు చెప్పారు.
చైనాలో త్రైమాసికాల వారీగా ఐఫోన్ విక్రయాలు తగ్గుముఖం పడుతున్నాయని టిమ్ కుక్ చెప్పారు. దీనికి తోడు అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధంలో హువావే ఎగ్జిక్యూటివ్ మెంగ్ వాంగ్ జౌను కెనడాలో అరెస్ట్ చేయడం చైనీయుల్లో, చైనా సంస్థల్లో ఆగ్రహాన్ని తెప్పించిన సంగతి తెలిసిందే.
ఐ ఫోన్ కొన్నా, కలిగి ఉన్నా భారీ జరిమానా విధిస్తామని చైనా సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించాయి కూడా. మూడు నెలలకొక సారి ఐఫోన్లను అప్ గ్రేడ్ చేయకపోవడం వల్ల కూడా వాటి కొనుగోళ్లు తగ్గాయని టిమ్ కుక్ అంగీకరించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో ఒడిదొడుకులు, హెచ్చు తగ్గుల వ్యవహారంతో డాలర్ మారకం విలువ పెరిగినప్పుడల్లా తమ ఐఫోన్ ధర పెరుగుతుందన్నారు.
ఐఫోన్ విక్రయాల పెంపునకు ఇప్పటికే చైనాలో థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూటర్లకు వాటిని పంపిణీ చేస్తున్నామని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. దీనివల్ల తమ ఉత్పత్తుల ధరలు తగ్గించక తప్పలేదన్నారు. ఇదే వ్యూహాన్ని భారతదేశంలోనూ అమలు చేస్తామన్నారు.
అంతర్జాతీయంగా చైనా, భారతదేశాలు మాత్రమే పెద్ద మార్కెట్లు. కనుక ఆ రెండు దేశాల్లో ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా కార్పొరేట్ సంస్థలు వ్యవహరించనున్నాయని దీనితో అర్థమవుతున్నది. ధరల తగ్గించడానికి బదులు స్టోర్ల నిర్వహణ చేపట్టాలన్నా సిబ్బంది నియామకంతోపాటు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు.
ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపులు, ఇతర రాయితీలు కోరుతున్నది. అందుకోసం భారతదేశంలోనే అసెంబ్లింగ్ చేయడంతోపాటు బ్రాండెడ్ స్టోర్ రూమ్‌లను భారతదేశంలో ప్రారంభిస్తున్నది. హాంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సర్వే ప్రకారం 2017తో పోలిస్తే 2018 ఐఫోన్ విక్రయాలు 50 శాతం తగ్గుముఖం పట్టాయి.
2017లో 3.2 మిలియన్ల ఫోన్ల విక్రయాలు సాగితే అది 2018లో 1.7 మిలియన్ల యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. దీన్ని భర్తీ చేసుకునేందుకు యాపిల్.. నోకియా భారత్ చీఫ్ కస్టమర్ ఆపరేషన్స్ అధికారిగా పని చేసిన ఆశీష్ చౌదరిని నియమించుకున్నది. ఆశీష్ చౌదరి మాట్లాడుతూ దీర్ఘ కాల వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు.