అమెజాన్ కొత్త సర్వీస్‌.. పే లెటర్ పేరుతో వడ్డీలేని అప్పు..

By Sandra Ashok KumarFirst Published Apr 30, 2020, 1:08 PM IST
Highlights

ఈ-కామర్స్ రిటైల్ సంస్థ అమెజాన్ ఇండియా.. భారతదేశంలో తాజాగా ‘పే లెటర్’ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రూ.60 వేల వరకు రుణ పరపతి పొందొచ్చు.
 

న్యూఢిల్లీ: ముందు వస్తువులను కొని తర్వాత డబ్బులు చెల్లించే అవకాశాన్ని ఈ-కామర్స్ రిటైల్ సంస్థ అమెజాన్‌‌‌‌ ఇండియా కల్పిస్తోంది. ఇందుకోసం ‘అమెజాన్‌‌ పే లేటర్‌‌‌‌’ పేరుతో ఓ క్రెడిట్‌ సర్వీస్‌ అందుబాటులోకి తెచ్చింది. 

ప్రస్తుత లాక్‌డౌన్‌‌ టైమ్‌లో యుటిలిటీ బిల్లులను లేదా అత్యవసర వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ పే లేటర్‌ ‌ఫెసిలిటీని కస్టమర్లు వినియోగించుకోవచ్చు. అమెజాన్‌ ఇండియాలో లిస్టయిన ఏ ప్రొడక్ట్‌‌నైనా కొనుగోలు చేయడానికి వడ్డీలేని అప్పును కంపెనీ ఆఫర్‌‌‌‌ చేస్తోంది.

అమెజాన్ పే లెటర్ నుంచి తీసుకునే ఈ అప్పును తర్వాతి నెలలో ఒకేసారి చెల్లించవచ్చు. లేదనుకుంటే ఈఎంఐల కింద కన్వర్ట్‌ ‌చేసుకోవచ్చు. ఇలా ఈఎంఐల కింద కన్వర్ట్ చేసుకుంటే మాత్రం నెలకు 1.5 శాతం నుంచి 2 శాతం వరకు వడ్డీని అమెజాన్ వసూలు చేస్తుంది. 

ఈ అప్పును గరిష్టంగా 12 ఈఎంఐలలో చెల్లించొచ్చు. పే లేటర్‌‌‌‌లో భాగంగా కస్టమర్‌‌‌‌ కనిష్టంగా ఒక్క రూపాయి నుంచి, గరిష్టంగా రూ. 60,000 వరకు కొనుగోలు చెయొచ్చు. 

ఆర్బీఐ నిబంధనల ‌ప్రకారమే ఈ గరిష్ట పరిమితిని నిర్ణయించినట్లు అమెజాన్ పే లెటర్ కంపెనీ పేర్కొంది. ‘అమెజాన్‌ ‌పే లేటర్‌ ‌‌‌సర్వీస్‌’ కోసం అమెజాన్‌‌ మొబైల్‌ ‌యాప్‌ ద్వారా రిజిస్టర్‌‌ ‌‌కావాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఈ సర్వీసుకు డెస్క్‌‌‌టాప్‌ సపోర్ట్‌‌ లేదు. అమెజాన్‌ ‌పే లెటర్‌లో కస్టమర్లు తమ కేవైసీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. కేవైసీ పూర్తయ్యాక పే లేటర్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌ స్టేటస్‌ను అమెజాన్‌‌ పే డ్యాష్‌ బోర్డులో తనిఖీ చేసుకోవచ్చు. ఈ డ్యాష్‌ బోర్డులో లావాదేవీల వివరాలను చూసుకోవచ్చు.

ఇదిలా ఉంటే మరోవైపు అమెజాన్ కరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో అమెజాన్ ఇండియా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. దెబ్బతిన్న చిన్న స్థాయి లాజిస్టిక్స్‌ భాగస్వామ్య సంస్థలకు ఈ నిధి తోడ్పాటునిస్తుంది.

సరుకు డెలివరీ సేవలందించే చిన్న, మధ్య తరహా వ్యాపార భాగస్వామ్య సంస్థలకు, దేశీయంగా ఎంపిక చేసిన రవాణా భాగస్వామ్య సంస్థలకు దీని ద్వారా సహాయం అందించనున్నట్లు అమెజాన్ తెలిపింది. ఏప్రిల్‌లో సిబ్బంది చెల్లింపులు, కీలక ఇన్‌ఫ్రా వ్యయాలు లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత వ్యాపార కార్యకలాపాలు పూర్తి స్థాయిలో విస్తరించుకునేందుకు వీలు కల్పిస్తుంది.

ఆయా సంస్థలకు ఇందుకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును వన్‌టైమ్‌ ప్రాతిపదికన సమకూర్చనున్నట్లు అమెజాన్‌ కస్టమర్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ ఆపరేషన్స్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ అఖిల్‌ సక్సేనా తెలిపారు. కరోనా బారిన పడిన వారికి తోడ్పాటునిచ్చేందుకు కంపెనీ ఇటీవలే 25 మిలియన్‌ డాలర్లతో అమెజాన్‌ రిలీఫ్‌ ఫండ్‌ (ఏఆర్‌ఎఫ్‌) ప్రారంభించింది. దీన్ని ఎంపిక చేసిన డెలివరీ భాగస్వాములకు కూడా వర్తింపచేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. 

click me!