మరో సంచలనానికి రెడీ అవుతున్న ముకేశ్ అంబానీ: మార్కెట్లోకి సొంత 5జీ ఫోన్‌?

By Siva Kodati  |  First Published Feb 6, 2019, 11:55 AM IST

4జీ సేవలతోపాటు జియో రంగ ప్రవేశంతో దేశీయంగా టెలికం సేవలు మరింత చౌకగా మారాయి. వచ్చే ఏడాది చివరికల్లా 5జీ సేవలు దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సొంతంగా 5జీ జియో స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ప్రణాళికలు రూపొందిస్తోంది.


అతి తక్కువ ధరలకే టెలికం సేవలను అందుబాటులోకి తేవడంతోపాటు ఇతర టెలికం ప్రొవైడర్లను అతలాకుతలం చేసిన నేపథ్యం రిలయన్స్ జియోది. తక్కువ కాలంలోనే కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది.

వేగవంతమైన 4జీ సేవలను అందిస్తున్న జియో త్వరలోనే 5జీ సేవలను అందుబాటులోకి తేవడంతోపాటు 5జీతో పనిచేసే మొబైల్‌ను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ సేవలను వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి తేవాలని జియో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Latest Videos

undefined

స్పెక్ట్రం వేలం పూర్తయిన ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా పనులు సిద్ధం చేస్తున్నట్లు ఓ ఆంగ్ల ప్రతిక పేర్కొంది. ఈ నేపథ్యంలో సొంత 5జీ హ్యాండ్‌సెట్‌లను కూడా సిద్ధం చేస్తోంది. అదే సమయంలో 5జీ ఆధారంగా పనిచేసే ఫీచర్‌ ఫోన్‌నూ వినియోగంలోకి తేవాలని జియో యోచిస్తోందని వినికిడి.

త్వరలోనే అమెరికా‌, యూరప్‌లలో 5జీ నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికి ఏ కంపెనీ పూర్తి స్థాయి 5జీ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయలేదు. ఈ ఏడాది 5జీ ఆధారిత మొబైళ్లను విడుదల చేయాలని పలు కంపెనీలు భావిస్తున్నాయి. 

ఇందులో భాగంగా త్వరలో జరగబోయే మొబైల్‌ వరల్డ్ కాంగ్రెస్‌లో పలు సంస్థలు తమ మొదటి 5జీ మొబైల్‌ను విడుదల చేయవచ్చు. ఈ నెట్‌వర్క్‌తో పనిచేసే ఫోల్డబుల్‌ ఫోన్‌ను తేనున్నట్లు చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం హువావే ఇప్పటికే ప్రకటించింది.

5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్‌ను చేసేలా శాంసంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ ఉండవచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. మరోపక్క వన్‌ప్లస్‌, షామీ సంస్థలు కూడా 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై పనిచేస్తున్నాయి. 

వచ్చే ఏడాది చివరికల్లా దేశంలో 5జీ సేవలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2019 చివరిలో ఇందుకు సంబంధించిన స్పెక్ట్రం వేలం వేయనున్నారు. 5జీ మొబైల్‌ ఫోన్లు అందుబాటులో లేని దృష్ట్యా ఈ సేవలు మరింత ఆలస్యం కావచ్చునని అంచనా వేస్తున్నారు.

వచ్చే ఏడాది కల్లా 5జీ సేవలతోపాటు జియో గిగా ఫైబర్ నెట్‌వర్క్ వాణిజ్యపరంగా వినియోగంలోకి రానున్నది. 2017 నుంచే 5జీ సేవలను అందుబాటులోకి తేవడంపై ముకేశ్ అంబానీ సారథ్యంలోని జియో కసరత్తు ప్రారంభించింది. ఫోన్ల తయారీపై వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. 

click me!