ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం వీడియో కాలింగ్ ఫీచర్‌ను మరింత సులభతరం చేసింది. ఇక నుంచి గ్రూప్‌లోని సభ్యులందరికీ ఒకేసారి వీడియో కాల్ కనెక్ట్ అయ్యే వసతిని అందుబాటులోకి తెచ్చింది.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. శ్రేయోభిలాషులు, బంధువుల బాగోగులను వీడియో కాల్, వాయిస్ ద్వారా తెలుసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వినియోగదారుల సౌకర్యార్థం వీడియో కాలింగ్ ఫీచర్‌ను మరింత సులభతరం చేసింది వాట్సాప్. ఒక గ్రూప్‌లోని సభ్యులందిరికీ ఒకేసారి వీడియోకాల్ కనెక్ట్ అయ్యే వసతిని అందుబాటులోకి తెచ్చింది. అయితే గ్రూప్‌లో నలుగురికి మించి సభ్యులుంటే ఈ ఫీచర్ ఉండదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు కూడా ఈ ఫీచర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.
also read ఐటీ కొలువులకు హైదరాబాద్ బెస్ట్... బట్ బెంగళూరు ఫస్ట్
వీడియో కాలింగ్ ఫీచర్ ద్వారా నలుగురితో ఒకేసారి కనెక్ట్ అయ్యే సదుపాయం ఇప్పటికే ఉంది. 2018లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అయితే మొదట ఒక్కరికి కాల్ చేశాక యాడ్ పార్టిసిపేంట్ ఆప్షన్ ద్వారా ఒక్కొక్కరిని కనెక్ట్ చేసుకోవాలి. కానీ కొత్త ఫీచర్‌తో నేరుగా ఒకేసారి నలుగురు కనెక్ట్ అవ్వచ్చు.
ట్రాపింగ్ బటన్ నొక్కితే ఒకేసారి నలుగురితో వీడియో కాల్‌లో మాట్లాడవచ్చు. ఈ ఫెసిలిటీతో ఆడియో కాలింగ్ కూడా చేయొచ్చు. ఫేస్ బుక్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ యాప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒకేసారి నలుగురితో వీడియో కాన్ఫరెన్స్ వసతి కల్పించినట్లు ప్రకటించింది.
కరోనాపై అవగాహన కోసం ఇప్పటికే పలు సమాచారాన్ని వినియోగదారులకు వాట్సాప్ చేరవేస్తోంది . ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాలు, సూచనలు, ఆరోగ్య సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తోంది.