కరోనా ‘లాక్‌డౌన్’: స్మార్ట్‌ఫోన్ల పరిశ్రమకు వేల కోట్ల నష్టం

By Sandra Ashok Kumar  |  First Published Apr 4, 2020, 11:23 AM IST

స్మార్ట్‌ఫోన్ల పరిశ్రమకు గడ్డుగాలం దాపురించింది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల దేశీయంగా గత నెల 22 నుంచి లాక్ డౌన్, ప్రజల కదలికలపై ఆంక్షలతో వ్యాపార లావాదేవీలు స్తంభించాయి. ప్రత్యేకించి లాక్ డౌన్ వల్ల దిగుమతులు నిలిచిపోయాయి. తత్ఫలితంగా ఈ లాక్ డౌన్ కాలంలో స్మార్ట్ ఫోన్ల పరిశ్రమకు రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. 
 


న్యూఢిల్లీ: ఆధునిక ప్రపంచంలో ఫోన్.. అందునా స్మార్ట్ ఫోన్ లేకుండా కాలం గడువని రోజులివి. అటువంటిది కరోనా లాక్‌డౌన్‌ దెబ్బతో దేశీయ స్మార్ట్‌ఫోన్ల పరిశ్రమ విలవిల్లాడుతోంది. మొబైల్‌ ఫోన్ల విక్రయాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 

గత నెల 19న ప్రధాని నరేంద్రమోదీ ఆ నెల 22న జాతీయ కర్ఫ్యూ పేరిట దేశవ్యాప్తంగా స్వచ్ఛంద లాక్‌డౌన్‌ ప్రకటించడానికి ముందు వరకు మార్చిలో మొబైల్‌ ఫోన్ల అమ్మకాలు బాగానే జరిగాయి. లాక్‌డౌన్‌ తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి. 

Latest Videos

undefined

ఆన్‌లైన్‌లోనూ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు జరగడం లేదు. ఏప్రిల్‌లోనూ అమ్మకాలు అంతంతే సాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని స్మార్ట్‌ఫోన్ల పరిశ్రమ 200 కోట్ల డాలర్ల (రూ.15,000 కోట్లు) రాబడిని కోల్పోయే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అంచనా వేస్తోంది.

గత ఏడాదిలో 15.8 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది మాత్రం అమ్మకాలు మూడు శాతం తగ్గి 15.3 కోట్ల యూనిట్లకు చేరుకోవచ్చని అంచనా. మార్చిలో అమ్మకాలు గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 27 శాతం తగ్గవచ్చని అంచనా వేస్తున్నామని కౌంటర్ పాయింట్ తెలిపింది.

ఈ నెల ఏప్రిల్‌ 14వరకు లాక్‌డౌన్‌ కొనసాగితే అమ్మకాలు దాదాపు 60 శాతం తగ్గే ఆస్కారం ఉందని, ఇదే కంపెనీలు తమ రాబడిని కోల్పోయేందుకు దారితీస్తోందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాథక్‌ తెలిపారు. 

దీంతో ఈఏడాది స్మార్ట్‌ఫోన్ల దిగుమతి 158 మిలియన్ల యూనిట్ల నుంచి 153 మిలియన్‌ యూనిట్లకు పడిపోనున్నట్లు కౌంటర్‌ పాయింట్‌ రీసర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాథక్ తెలిపారు. లాక్‌డౌన్‌ కొనసాగితే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. 

గతేడాదితో పోలిస్తే మార్చి, ఏప్రిల్ నెలల్లో స్మార్ట్ ఫోన్ల దిగుమతులు గణనీయంగా తగ్గడమే దీనికి కారణమని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. గత నెల రెండో వారం వరకు భారతదేశంలో కరోనా విస్తరణ పరిమితంగానే ఉన్నా.. తర్వాత చాలా రాష్ట్రాలకు విస్తరించిందని గుర్తు చేసింది. 

also read జీఎస్టీ శ్లాబ్ పెంపు: భారీగా పెరిగిన స్మార్ట్ ఫోన్ల ధరలు

కాగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొత్త టెలికాం వినియోగదారుల సంఖ్య కూడా తగ్గిపోయింది. నెలవారీగా సగటున 15-30 లక్షల మంది కొత్త వారు చేరుతుంటే.. గత మార్చిలో మాత్రం ఈ సంఖ్య 5 లక్షలకు పడిపోయింది.

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగానూ క‌రోనా-లాక్‌డౌన్ ప్ర‌భావం స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాల‌పై ప‌డింది. గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో వీటి అమ్మ‌కాలు 14 శాతం పడిపోయాయి. హాంకాంగ్‌ ప్రధాన కేంద్రంగా పనిచేసే గ్లోబల్‌ ఇండస్ట్రీ అనాలిసిస్‌ సంస్థ నివేదికను విడుదలచేసింది. 

గ్లోబల్ ఇండస్ట్రీ అనాలిసిస్ నివేదిక ప్రకారం ఆపిల్‌ ఫోన్లతోపాటు, ఇతర స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు 14 శాతం తగ్గిపోయాయని వెల్ల‌డించింది. ఇది గతేడాదితోపోల్చితే 38 శాతం తక్కువని ప్ర‌క‌టించింది. 

ప్రస్తుతం చైనా, దక్షిణ కొరియా మినహా ప్రపంచ దేశాలపై కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావం చూపుతుండటంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు మరింత క్షీణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
 

click me!