సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్‌ఐ) అధ్యక్షులుగా బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పంకజ్ సింగ్ మాట్లాడుతూ.. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
నైనిటాల్: సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్‌ఐ) అధ్యక్షులుగా బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ నైనిటాల్‌లోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో 23 ఏప్రిల్ 2023న జరిగిన వార్షిక జనరల్ బాడీ అండ్ ఎలక్షన్ మీటింగ్‌లో ఈ ఎన్నిక జరిగింది. పంకజ్ సింగ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి నోయిడా నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక, సీఎఫ్ఐ సెక్రటరీ జనరల్ పదవికి వరుసగా రెండో సారి మణిందర్ పాల్ సింగ్ ఎన్నికయ్యారు. కోశాధికారి పదవిని కేరళకు చెందిన సుదీష్ కుమార్ దక్కించుకున్నారు.
ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, గుజరాత్, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఇద్దరు సభ్యుల ఎన్నికయ్యారు. అదే సమయంలో చండీగఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, బీహార్, తమిళనాడు, ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్‌ల నుంచి ఒక్కొక్క సభ్యులు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా పంకజ్ సింగ్ మాట్లాడుతూ.. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నేను సైక్లిస్ట్‌లకు మాత్రమే కాకుండా భారతదేశంలోని క్రీడాకారులకు అత్యుత్తమ సౌకర్యాలు అందేలా చూస్తాను. క్షేత్రస్థాయిలో కార్యక్రమాలపై దృష్టి సారిస్తాను’’ అని ఆయన చెప్పారు. ‘‘నా వంతుగా నేను ఇంకా ఎక్కువ పని చేయాల్సి ఉంది. సైక్లింగ్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. అయితే మనం దానిని ఉన్నత స్థాయికి అభివృద్ధి చేయాలి. మనం ఉత్తమ ప్రతిభను కలిగి ఉన్న ఆటగాళ్ల కోసం క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలి. మనం వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించగలం’’ అని పంకజ్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా హాజరైన సభ్యులందరికీ సీఎఫ్ఐ సెక్రటరీ జనరల్ మణిందర్ పాల్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇక, ఏషియన్ సైక్లింగ్ కాన్ఫెడరేషన్ ఓంకార్ సింగ్ ఈ సమావేశానికి ఏసీసీ పరిశీలకునిగా హాజరయ్యారు. ఐవోఏ పరిశీలకునిగా డీకే సింగ్ హాజరయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జస్టిస్ ఆర్కే గౌబా (రిటైర్డ్) ఫలితాలను ప్రకటించారు.