ఫైనల్‌లో మూడు సార్లు ఛాంపియన్ టీమ్ సౌతాఫ్రికాని 17-10 తేడాతో ఓడించి... స్వర్ణం కైవసం చేసుకున్న భారత వుమెన్స్ లాన్ బౌల్స్ జట్టు...
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత వుమెన్స్ లాన్ బౌల్స్ టీమ్ అద్భుతం చేసింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా, పెద్దగా ఎవ్వరికీ పరిచయం లేని ఈవెంట్‌లో అంచనాలకు మించి రాణించిన భారత లాన్ బౌల్స్ టీమ్, ఫైనల్‌లో మూడు సార్లు ఛాంపియన్ టీమ్ సౌతాఫ్రికాని 17-10 తేడాతో ఓడించి... స్వర్ణం కైవసం చేసుకుంది...
భారత వుమెన్ లాన్ బౌల్స్ టీమ్‌లోని రూపా దేవి ట్రికీ, నయన్‌మోనీ సైకియా, లవ్లీ చౌబీ, పింకీ సింగ్... ఫైనల్‌లో ఆరంభం నుంచి సౌతాఫ్రికాపై ఆధిక్యాన్ని కొనసాగించారు. ఒకానొక దశలో 8-2 తేడాతో సౌతాఫ్రికాపై పూర్తి ఆధిక్యం కనబర్చింది భారత జట్టు...
undefined
అయితే మూడు సార్లు కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ గెలిచిన సౌతాఫ్రికా ఆ తర్వాత ఊహించని రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చి 8-8 తేడాతో స్కోర్లను సమం చేసింది. ఆ తర్వాత భారత జట్టు 10-8 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లగా మరోసారి సౌతాఫ్రికా 10-10 తేడాతో స్కోర్లను సమం చేసింది...
ఆఖరి 3 రౌండ్లలో భారత జట్టు ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది. 13 ఎండ్స్ ముగిసే సమయానికి 12-10, 14 ఎండ్స్ ముగిసే సమయానికి 15-10 తేడాతో ఆఖరి ఎండ్‌ని 17-10 తేడాతో ముగించి లాన్ బౌల్స్‌లో మొట్టమొదటి స్వర్ణం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 16-13 తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్‌కి దూసుకొచ్చింది భారత లాన్ బౌల్స్ టీమ్...
ఈ విజయంతో భారత్ ఖాతాలో 10 పతకాలు చేరాయి. ఇందులో నాలుగు స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. ఒలింపిక్ మెడలిస్ట్ మీరాబాయి ఛాను గోల్డ్ మెడల్ గెలవగా పురుష వెయిట్ లిఫ్టర్ సంకేత్ సర్గర్ రజతం గెలిచాడు. గురురాజ పూజారి కాంస్యం గెలవగా మరో మహిళా వెయిట్‌లిఫ్టర్ బింద్యారాణి దేవి రజతం గెలిచింది.
67 కేజీల మెన్స్ వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్‌లో భారత వెయిట్‌లిఫ్టర్, 19 ఏళ్ల జెరెమీ లాల్రిన్నుంగా, తన ఏకంగా 300 కేజీలు ఎత్తి... భారత్‌కి రెండో స్వర్ణం అందించాడు. మూడో రోజు వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 73 కిలోల విభాగంలో అచింత షెవులి మూడో స్వర్ణం అందించాడు.
స్మిమ్మింగ్‌లో భారత స్విమ్మర్లు అద్వైత్ పాగే, కుసగ్ర రావత్, 1500 మీటర్ల ఈవెంట్‌లో ఫైనల్‌కి అర్హత సాధించారు. అద్వైత్ ఏడో స్థానంలో నిలిస్తే, కుసగ్ర 8వ స్థానంలో నిలిచాడు. మహిళల షార్ట్ పుట్ ఈవెంట్‌లో మన్‌ప్రీత్ కౌర్ 16.78 మీటర్ల దూరం విసిరి 7వ స్థానంలో నిలిచి ఫైనల్‌కి అర్హత సాధించింది...
అలాగే పురుషుల లాంగ్ జంప్ ఈవెంట్‌లో పోటీపడిన మహమ్మద్ యహియా, మురళీ శ్రీశంకర్ 7.68 మీటర్లు జంప్ చేసి ఫైనల్‌కి అర్హత సాధించారు. టేబుల్ టెన్నిస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో కామన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టిన భారత పురుషుల జట్టు, నైజీరియాపై 3-0 తేడాతో విజయం అందుకుని, ఫైనల్‌కి దూసుకెళ్లింది...