రిటైర్మెంట్ తో షాకిచ్చిన జర్మన్ ఫుట్‌బాల్ దిగ్గజం మాన్యుయెల్ న్యూయర్

By Mahesh RajamoniFirst Published Aug 21, 2024, 10:47 PM IST
Highlights

జర్మనీకి చెందిన దిగ్గజ గోల్‌కీపర్ మాన్యుయెల్ న్యూయర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల న్యూయర్ 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి సీనియర్ జట్టు తరఫున ఇప్పటివరకు 124 మ్యాచ్‌లు ఆడాడు.

German football legend Manuel Neuer : జర్మనీకి చెందిన దిగ్గజ ఆటగాడు మాన్యుయెల్ న్యూయర్ బుధవారం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. జర్మన్ జాతీయ జట్టుకు స్టార్ పేయర్ గా కొనసాగుతున్న అతను తన రిటైర్మెంట్ తో అందిరినీ షాక్ కు గురిచేశాడు. బేయర్న్ మ్యూనిచ్ గోల్‌కీపర్ అయిన అతను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించాడు. యూరో 2024లో తన దేశం పేలవమైన ప్రదర్శన తర్వాత  ఫుట్ బాల్ కు వీడ్కోలు పలికిన నాల్గవ జర్మన్ లెజెండ్ అయ్యాడు. జర్మనీ తరపున 124 మ్యాచ్‌లు ఆడిన అతను, 2014లో ప్రపంచ కప్ విజయంలో కీలక వ్యక్తిగా ఉన్నాడు. 2026 ప్రపంచ కప్‌లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు గతంలో ఊహాగానాలు వచ్చాయి. అయితే, అతను ఇప్పుడు తన అంతర్జాతీయ కెరీర్‌ కు వీడ్కోలు పలకడం పై క్రీడా ప్రపంచం షాక్ అవుతోంది. 15 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణంలో తన జట్టుకు అనేక విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు  మాన్యుయెల్ న్యూయర్.

 

 

తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో, నూయర్ మాన్‌షాఫ్ట్‌తో తన నిర్ణయం గురించి ప్రస్తావిస్తూ.. "నేడు జాతీయ జట్టుతో నా కెరీర్ ముగిసింది. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు అంత సులభం కాదు.. నేను ఇక్కడ అరంగేట్రం చేసి 15 సంవత్సరాలకు పైగా అయింది" అని పేర్కొన్నాడు.అలాగే, ఇప్పటివరకు తనకు సహకరించిన తన సహచరులు, డీఎఫ్బీ సిబ్బంది, కోచ్‌లు, గోల్‌కీపింగ్ కోచ్‌లు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. దేశ జెర్సీని ధరించడం ఎంతో గర్వంగా ఉందనీ, ఇదంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. వేసవిలో జరిగిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో జర్మన్ జెర్సీలో న్యూయర్ చివరిసారిగా కనిపించాడు. అక్కడ జర్మనీ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓడిపోయింది. కాగా, న్యూయర్ వీడ్కోలు నిర్ణయం జర్మన్ ఫుట్‌బాల్‌కు ఒక శకం ముగింపును సూచిస్తుంది, ఎందుకంటే అతను తన కెరీర్‌లో ముఖ్యమైన భాగమైన జట్టు నుండి తప్పుకున్నాడు.

click me!