లండన్‌లో దారుణం జరిగింది. ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే శవాలుగా తేలారు.
లండన్‌లో దారుణం జరిగింది. ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే శవాలుగా తేలారు. మలేషియాకు చెందిన తమిళ జంట కుహరాజ్ అతని భార్య పూర్ణ కామేశ్వరి, వారి మూడేళ్ల కుమారుడు కైలేష్ కుహరాజ్ చివరికి పెంపుడు కుక్క సైతం రక్తం మడుగులో పడి వుంది. అందరి మెడలు కత్తితో కోసి ఉన్నాయి.
కుహరాజ్ భార్య, కుమారుడు మరణించి వారం నుంచి పదిరోజులు అయింటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి వెస్ట్ లండన్ పోలీసులు బ్రెంట్‌ఫోర్డ్‌లోని ఓ అపార్ట్‌మెంట్ నాలుగవ అంతస్తులో నివసిస్తున్న కుహరాజ్ ఫ్లాట్ వద్దకు వెళ్లారు.
ఎన్ని ఫోన్లు చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడం, తలుపులు కొట్టినా ఎవరూ పలకపోవడంతో పోలీసులు వెనక్కి వచ్చేశారు. పోలీసులు మళ్లీ ఆ ఫ్లాట్‌కు వెళ్లి చూడగా లోపలి నుంచి ఎలాంటి అలికిడి వినిపించలేదు.
చేసేది లేక తలుపులు బద్ధలు కొట్టి చూశారు. అక్కడ కుహరాజ్ కుటుంబసభ్యులు విగత జీవులుగా పడివున్నారు. దీనిపై స్థానికులను విచారించగా.. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఆ ఇంటికి, ఎవరు వచ్చి పోయినట్లుగా, ఇంట్లో మనిషులున్నట్లు అలికిడి వినిపించలేదని తెలిపారు.
కుహరాజ్ దంపతులు అందరితో కలివిడిగా ఉంటారని, నవ్వుతూ పలకరించేవారని స్థానికులు తెలిపారు. అయితే అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగినట్లుగా అరుపులు వినిపించేవని చెప్పారు.
కుహరాజ్‌పై హత్య, ఆత్మహత్య కేసులను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాలకు గురువారం పోస్ట్‌మార్టం నిర్వహిస్తారని, ఈ హత్యలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా తమకు తెలియజేయాల్సిందిగా డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.