ఏకంగా అమెరికా ప్రభుత్వానికే కుచ్చుటోపీ: 5.5 మిలియన్ల టోకరా.. భారతీయుడి అరెస్ట్

By Siva KodatiFirst Published Jul 25, 2020, 6:33 PM IST
Highlights

ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రకటించిన ఈ ఉద్దీపన ప్యాకేజీలను అందిపుచ్చుకునేందుకు అడ్డదారి తొక్కాడు ఓ భారత సంతతి సాంకేతిక నిపుణుడు

కరోనా వైరస్‌ను తొలుత లైట్ తీసుకున్న అగ్రరాజ్యం అమెరికా ఆ తర్వాత చర్యలకు పూనుకుంది. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో కుదేలవుతున్న ఆర్ధిక వ్యవస్ధను నిలబెట్టేందుకు ట్రంప్ భారీ ఉద్దీపన ప్యాకేజ్‌లను ప్రకటించారు.

ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రకటించిన ఈ ఉద్దీపన ప్యాకేజీలను అందిపుచ్చుకునేందుకు అడ్డదారి తొక్కాడు ఓ భారత సంతతి సాంకేతిక నిపుణుడు. సుమారు 5.5 మిలియన్ డాలర్ల మేర టోకరా వేసేందుకు ఆయన ప్రయత్నించాడు.

ముకుంద్ మోహన్ అనే టెక్ ప్రొఫెషనల్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజన కంపెనీల్లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం బిల్డ్ డైరెక్ట్. కామ్‌ టెక్నాలజీస్‌కు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఆయనకు రాబిన్‌హుడ్ అనే బ్రోకరేజ్ సంస్థ ఉంది. కరోనా కారణంగా ముకుంద్ కంపెనీ సైతం తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. దీంతో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు గాను ట్రంప్ సర్కార్ ప్రకటించిన ‘‘ పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం’’ ప్రయోజనాలు పొందేందుకు ముకుంద్ మోహన్ స్కెచ్ వేశాడు.

కుట్రలో భాగంగా ఆరు షెల్ కంపెనీలు పేరిట ఎనిమిది రకాల లోన్లకు దరఖాస్తు చేసుకున్నాడు. తన కంపెనీలోని ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు గతేడాది దాదాపు 2.3 మిలియన్ డాలర్ల మేర ఖర్చు చేశానని పేర్కొన్నాడు.

అందువల్ల ఈ ప్రోగ్రామ్‌కు తనను అర్హుడిగా భావించి లోన్ మంజూరు చేయాల్సిందిగా కోరాడు. నిజానికి ఈ ఏడాది మేలోనే ఒక కంపెనీ యాజమాన్య హక్కులు మోహన్‌కు సంక్రమించాయని అందులో అసలు ఒక ఉద్యోగి కూడా లేడని తెలియడంతో మోహన్ గుట్టు  బయటపడింది.

దీంతో అతనిని సీటెల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ విషయంపై స్పందించేందుకు ముకుంద్ అతని బృందం నిరాకరించినట్లుగా స్థానిక మీడియా కథనాన్ని ప్రసారం చేసింది. 
 

click me!