3 నెలల ముందే అప్లై చేయాలి: హెచ్1-బీ వీసాపై యూఎస్ ఎంబసీ

By Arun Kumar PFirst Published Oct 12, 2019, 4:20 PM IST
Highlights

హెచ్1 బీ వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేస్తున్న అమెరికా మరో అడుగు ముందుకేసింది. అమెరికాలో ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం మూడు నెలల ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆ దేశ ఎంబసీ ట్వీట్ చేసింది. 
 

న్యూఢిల్లీ: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి కీలక సమాచారం వెల్లడైంది. హెచ్-1 బీ వీసా కోసం 90 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని అగ్రరాజ్య దౌత్య కార్యాలయం  ట్వీట్‌చేసింది. 

జాబ్‌లో జాయిన్ అయ్యే తేదీకి కనీసం మూడు నెలల ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అమెరికా ఎంబసీ పేర్కొంది. కనుక మీరు హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం 90 రోజుల ముందు 'ఐ-797' ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎంబసీ గురువారం ట్వీట్ చేసింది. 

ఇక 'ఐ-797' ఫారం అనేది “దరఖాస్తుదారులు/ పిటిషనర్లతో కమ్యూనికేట్ చేయడానికి లేదా ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాన్ని తెలియజేయడానికి” యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ఉపయోగించే పత్రం. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం యూఎస్‌సీఐఎస్ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

భారత్-యూఎస్ ద్వైపాక్షిక సంబంధాల మధ్య ముఖ్యమైన సమస్యలలో భారతీయ పౌరులకు అమెరికా వర్క్ వీసా ఒకటి. అధికంగా భారతీయ నిపుణులు ప్రయోజనం పొందుతున్న హెచ్1బీ వీసా జారీలో ఇప్పటికే అమెరికా ఎన్నో ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. దీనికీ కారణం ఉంది. 

ఈ వీసా ద్వారా అగ్రరాజ్యంలో పనిచేసే విదేశీయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో అమెరికన్లకు నష్టం వాటిల్లుతుందనే కారణంతో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా జారీని కఠినతరం చేస్తున్నారు. టెక్నాలజీపై పట్టు కలిగిన విదేశీ నిపుణులకు నిర్దిష్ట గడువు ప్రకారం పని చేసేందుకు అనుమతినిచ్చేదే హెచ్ 1 బీ వీసా. 
 

click me!