హైదరాబాద్ మౌలాలీ ప్రాంతానికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అనే యువతి అమెరికాలో అష్టకష్టాలు పడుతోంది. మతి చలించడంతో రోడ్లపై తిరుగుతూ ఎవరైనా ఏమైనా పెడితే తినడం లేనిపక్షంలో పస్తులుంటూ వస్తోంది.
ఉన్నత చదవులు చదివి జీవితంలో గొప్పస్థాయికి చేరుకోవాలని అమెరికా వెళ్లిన ఓ హైదరాబాద్ అమ్మాయి దేశం కానీ దేశంలో అష్టకష్టాలు పడుతోంది. కనీసం తన పేరు కూడా చెప్పుకోలేని స్థితిలో ఫుట్‌పాత్‌పై గడుపుతోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మౌలాలీ ప్రాంతానికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అనే యువతి మాస్టర్స్ చదివేందుకు 2021 ఆగస్టులో అమెరికా వెళ్లారు. డెట్రాయిట్‌లోని ట్రైన్ యూనివర్సిటీలో చేరిన ఆమె.. విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. చదువు, ఇతర కార్యక్రమాల్లో ఎంత బిజీగా వున్నప్పటికీ ప్రతిరోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడేది. కానీ ఏమైందో ఏమో కానీ రెండు నెలలుగా జైదీ నుంచి ఫోన్ రావడం లేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు అమెరికాలో తెలిసినవాళ్లకు ఫోన్ చేసి తమ కుమార్తె క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు.
ఈ నేపథ్యంలో కొందరు తెలుగువారికి జైదీ చికాగోలోని రోడ్లపై తిరుగుతూ కనిపించింది. దీనిపై ఆమెను ప్రశ్నించగా.. తన వస్తువులను ఎవరో చోరీ చేశారని జైదీ వారితో చెప్పింది. అప్పటికే మతి చలించడంతో రోడ్లపై తిరుగుతూ ఎవరైనా ఏమైనా పెడితే తినడం లేనిపక్షంలో పస్తులుంటూ వస్తోంది. తన పేరు తనకు కూడా గుర్తులేని స్థితికి జైదీ చేరుకుంది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఆమెను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీని గురించి తెలుసుకున్న జైదీ తల్లిదండ్రులు.. కూతురి దీనావస్థ చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డను క్షేమంగా భారతదేశానికి తీసుకురావాలని జైదీ తల్లి కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఆయన ఆమెను భారత్‌కు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.