భార్యకు వేధింపులు... అమెరికాలో తెలుగు యువకుడికి జైలు శిక్ష

By telugu news teamFirst Published May 20, 2021, 7:57 AM IST
Highlights

టెక్సాస్ లోని తన ఇంటి నుంచి మైసాచుసెట్స్ రాష్ట్రంలోని ఆగావామ్ నగరానికి బయలుదేరాడు. అక్కడకు వెళ్లిన తర్వాత తన భార్యను బలవంతంగా కారెక్కించుకొని మళ్లీ టెక్సాస్ కు వెళ్లిపోయాడు.

భార్యను పలురకాలుగా హింసించిన కారణంగా.. తెలుగు యువకుడికి అమెరికాలో జైలు శిక్ష విధించారు. టెక్సాస్ లో స్థిరపడిన తెలుగు ఎన్ఆర్ఐ సునీల్ కె. ఆకుల(32)కు 56నెలల జైలు శిక్ష, విడుదల తర్వాత మూడేళ్ల పాటు పెరోల్ విధిస్తూ.. అమెరికాలో న్యాయస్థానం తీర్పు  వెలువరించింది.

కట్టుకున్న భార్యను అపహరించి.. ఆమెను దారుణంగా కొట్టడంతోపాటు.. సాక్ష్యాలను తారుమారు చేయాలని చూశాడనే అభియోగాలు నిందితుడిపై ఉన్నాయి. శిక్షాకాలం పూర్తైన తర్వాత సునీల్ దేశం వదిలి విడిచి వెళ్లాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. ఇతనిపై ఉన్న అభియోగాలు గతేడాది నవంబర్ లో రుజువయ్యాయి. 

ఫెడరల్ ప్రాసిక్యూటర్ కథనం మేరకు.. తన నుంచి విడిగా ఉంటున్న భార్యను కలుసుకునేందుకు 2019 ఆగస్టు 6న సునీల్ టెక్సాస్ లోని తన ఇంటి నుంచి మైసాచుసెట్స్ రాష్ట్రంలోని ఆగావామ్ నగరానికి బయలుదేరాడు. అక్కడకు వెళ్లిన తర్వాత తన భార్యను బలవంతంగా కారెక్కించుకొని మళ్లీ టెక్సాస్ కు వెళ్లిపోయాడు. మార్గమధ్యంలో భార్యను దారుణంగా కొడుతూ.. ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ బలవంత పెట్టాడు. 

ఆమె లాప్ టాప్ ధ్వంసం చేసి రోడ్డు మీద విసిరేశాడు. మధ్యలో టెనెసీ రాష్ట్రం నాక్స్ కౌంటీలో ఓ హోటలు దగ్గర ఆగినప్పుడు కూడా ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో స్థానిక పోలీసులు సునీల్ ని అరెస్టు చేశారు. నిందితుడు కస్టడీలో ఉన్న సమయంలో.. భారత్ లో ఉన్న కుటుంబసభ్యులు పదేపదే ఫోన్లు చేసి అతని భార్య ఇచ్చిన వాంగ్మూలం వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేసినట్లు విచారణ సమయంలో అధికారులు చెప్పడం గమనార్హం. 

click me!