విహారయాత్రలో విషాదం.. స్కాట్లాండ్‌లో ముగ్గురు భారతీయుల మృతి.. మృతుల్లో తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు..

By Sumanth KanukulaFirst Published Aug 23, 2022, 12:10 PM IST
Highlights

స్కాట్లాండ్‌లో గత వారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మరణించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

స్కాట్లాండ్‌లో గత వారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మరణించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన పవన్ బశెట్టి (23), సాయివర్మ చిలకమారి (24), ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన సుధాకర్ మోడేపల్లి (30), బెంగళూరుకు చెందిన గిరీష్ సుబ్రమణ్యం (23)లతో కూడిన స్నేహితుల బృందం స్కాట్లాండ్‌లో విహారయాత్రకు వెళ్లినట్టుగా తెలుస్తోంది.

గిరీష్, పవన్, సాయివర్మలు.. ఇంగ్లాడులోని లీసెస్టర్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలు చేస్తున్నారు. అప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సుధాకర్ లీసెస్టర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే వీరు స్కాట్లాండ్‌లో విహారయాత్రకు వెళ్లగా ఆగస్టు 19వ తేదీన విషాదం చోటుచేసుకుంది. స్కాటిష్ వెస్ట్ హైలాండ్స్‌లోని ఆర్గిల్‌లోని అప్పిన్ ప్రాంతంలో క్యాజిల్ స్టాకర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 

‘‘ఈ ప్రమాదంలో హోండా సివిక్, హెచ్‌జీవీ వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఏ828 ఓబాన్ నుంచి ఫోర్ట్ విలియం రోడ్డులో కాజిల్ స్టాకర్ సమీపంలో ప్రమాదం జరిగింది’’ అని స్కాట్లాండ్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్టుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇక, ఈ ప్రమాదంలో గిరీష్, పవన్, సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన సాయిని ఎయిర్ అంబులెన్స్‌లో గ్లాస్గోలోని క్వీన్ ఎలిజబెత్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. దౌత్య వర్గాల సమాచారం ప్రకారం.. సాయి పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. రోడ్డు ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి 47 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి తదుపరి విచారణ పెండింగ్‌లో ఉంచారు. ఎడిన్‌బర్గ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మృతదేహాలను స్వదేశానికి తరలించడంలో సహాయం చేస్తుంది. 

click me!