కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్ అంశాలపై విద్యార్థినులు, యువతులకు ‘స్టెమ్’ శిక్షణ ఇవ్వనున్నట్లు టెక్నాలజీ మేజర్ ‘ఐబీఎం’ ప్రకటించింది. రెండు లక్షల మంది మహిళలకు స్టెమ్ శిక్షణ ఇస్తామని తెలిపింది.
వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 10 లక్షల మహిళావిద్యార్థులకు ‘సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ (స్టెమ్)’లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం ప్రకటించింది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు తెలిపింది.
సోమవారం ఢిల్లీలో జరిగిన ‘ఐబీఎం ఇండియా స్కిల్స్ ఫోరం’లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో ఒప్పందం ఖరారు చేసుకున్నది. మరికొద్ది నెలల్లో మిగతా రాష్ట్ర ప్రభుత్వాలతోనూ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు కంపెనీ వివరించింది.
undefined
‘భవిష్యత్‌లో ఉద్యోగాలు 100 శాతం మారిపోనున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వినియోగం పెరుగుతుండటంతో ఉన్నత స్థాయి నిపుణులైన ఉద్యోగుల అవసరం కూడా పెరుగుతోంది’అని ఐబీఎం చైర్మన్, ప్రెసిడెంట్, సీఈఓ గిన్న రోమెట్టి తెలిపారు.
ఉద్యోగాల్లో మరింత మహిళలు అవసరం అవుతారన్న గిన్న రోమట్టి 8-12 తరగతుల్లో చదివే రెండు లక్షల మంది మహిళా విద్యార్థులకు వచ్చే మూడేళ్లలో స్టెమ్ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు.
ఇది కేవలం సాంకేతిక శిక్షణ మాత్రమే కాదని, క్రిటికల్ థింకింగ్, లైఫ్ స్కిల్స్‌తోపాటు ఇతర అంశాలపైనా దృష్టి పెట్టనున్నట్లు ఐబీఎం చైర్మన్, ప్రెసిడెంట్, సీఈఓ గిన్న రోమెట్టి చెప్పారు.
వచ్చే మూడేళ్లలో ఈ రెండు లక్షల మందితోపాటు మొత్తం పది లక్షల మంది విద్యార్థినులకు శిక్షణ ఇవ్వడంతోపాటు 40 లక్షల మంది టీచర్లకు విద్యా వనరులను సమకూర్చేందుకు కంపెనీ పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. భారత్‌లో మహిళలకు అవకాశాలు లభించిన ప్రతిసారీ పురుషుల కంటే మెరుగైన ప్రతిభ కనబర్చారన్నారు.
మహిళల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం దోహదకారిగా వ్యవహరించాల్సి ఉంటుందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ చెప్పారు. మహిళలకు కూడా కంపెనీల్లో స్థానం కల్పించే విషయంలో పురుషుల వైఖరిలోనే మార్పు రావాలని అన్నారు.
మహిళలకు సాధికారత కల్పించే అంశంపై దృష్టిసారించకుండా భారత్ 9-10 శాతం వృద్ధి సాధించడం అసాధ్యమని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లోని రెండు లక్షలకు పైగా మహిళా విద్యార్థులకు స్టెమ్‌లో క్లాస్‌రూమ్, ఆన్‌లైన్ శిక్షణను ఐబీఎం అందిస్తుంది.
వీరిని ఆధునిక సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ఉద్యోగాల కోసం సిద్ధం చేయనున్నది. ఆధునిక టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖతో కలిసి ‘ఐబీఎం’ రెండేళ్ల అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌ను రూపొందించింది.
మూడేళ్లలో ఈ ప్రోగ్రామ్‌ను 50 మహిళా ఐటీఐలతోపాటు మొత్తం వంద ఐటీఐల్లో అందుబాటులోకి తేనున్నది. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన కొందరు విద్యార్థులకు ఐబీఎం 5 నెలల ఇంటర్న్‌షిప్ కూడా ఆఫర్ చేయనుంది.
కేంద్రీయ విద్యాలయ స్కూళ్ల భాగస్వామ్యంతో టీచర్ అడ్వైజర్ విత్ వాట్సన్ ద్వారా దేశవ్యాప్తంగా గణిత ఉపాధ్యాయులకు ‘ఐబీఎం’ స్వయంగా బోధన వనరులు సమకూర్చనుంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వెబ్‌సైట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఐబీఎం చేపట్టనుంది.
తద్వారా 3 లక్షలకు పైగా మహిళా విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. దేశవ్యాప్తంగా 40 లక్షల మంది టీచర్లకు ఇండియన్ ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ కమ్యూనిటీ ఫర్ స్టెమ్‌లోని ‘టీచర్స్ ట్రై సైన్స్’ బోధన వనరుల యాక్సెస్ కల్పించనుంది.
కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే చేసుకున్న ఒప్పందంలో భాగంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత మెంటార్ ప్లాట్‌ఫామ్ ద్వారా 4 వేల మంది మెంటార్లు, 5 లక్షల మంది మహిళా విద్యార్థులతోపాటు మొత్తం 6 లక్షల మంది యువత లబ్ది పొందనున్నారు.