ఏపికి మూడు రాజధానులు వుండాలన్న జగన్ నిర్ణయంతో తెలంగాణకు లాభం చేకూరుతుంది కాబట్టే టీఆర్ఎస్ నాయకులు ఆ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పేర్కొన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని గత ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అనుక్షణం పరితపించారని టీడీపీ శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో వున్నాకూడా అమరావతి పరిరక్షణ కోసమే ఆయన పాటుపడుతున్నారని అన్నారు. ఆయన తపనను బాహుబలి గ్రాఫిక్స్ అంటూ కించపరిచేలా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడడం సరికాదని బీద మండిపడ్డారు.
చంద్రబాబు పాలనా దక్షత పనితీరు గురించి మాట్లాడే అర్హత తలసాని వంటి అవకాశవాద రాజకీయ నాయకులకు లేదన్నారు. అనుకున్న ప్రకారం అమరావతి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌కు పెట్టుబడులు రావడం కూడా కష్టమేనని గతంలో తెలంగాణ కేబినెట్‌లోని మంత్రులే వ్యాఖ్యానించడం వాస్తవం కాదా.? అని తలసానిని రవిచంద్ర ప్రశ్నించారు.
undefined
జగన్ అధికారంలోకి రావడంతో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకోవడం వాస్తవం కాదా.? అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి గర్వపడుతున్న తలసాని అసలు ఆ ధీమా కల్పించింది చంద్రబాబు విజనే అని గుర్తుంచుకోవాలన్నారు. సైబరాబాద్ నగర నిర్మాణం జరగకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఎక్కడుండేదో ఆలోచించాలన్నారు.
read more జగన్‌కు షాక్: అమరావతి రైతుల ఆందోళన, వాస్తవాలు ఇవీ..
హైదరాబాద్ ద్వారా వస్తున్న ఆదాయం, కల్పించబడిన ఉద్యోగాలు చంద్రబాబు విజన్ 2020కి నిదర్శనమని మరిచిపోయారా అని ప్రశ్నించారు. లక్షల కోట్ల ఆదాయం వచ్చేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్ది చేతుల్లో పెడితే పాలన చేతకాక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన మీరు చంద్రబాబు పాలన గురించి తప్పుగా మాట్లాడతారా అని మండిపడ్డారు.
ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వికేంద్రీకరణ కుట్రతో తెలంగాణ బాగుపడాలని.. ఏపీ విచ్ఛిన్నమవ్వాలన్న కుటిలయత్నంతోనే తెలంగాణ నాయకులు మూడు రాజధానులకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. అసలు పాలన అంటే ఏంటో చేతకాని టీఆర్‌ఎస్ నేతలు పాలన గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తోందని విమర్శించారు.
read more అద్దె ఇంట్లో కాపురం... కుటుంబ పోషణ భారం: మాజీ మంత్రి ఆవేదన
చంద్రబాబు పాలనా సమయంలో రాష్ట్ర అభివృద్ధితో తెలంగాణ ఐదేళ్ల అభివృద్ధిని పోల్చి చూసే ధైర్యం లేక విచ్ఛిన్న కుట్రకు ఆజ్యం పోయడం సిగ్గుమాలిన చర్యగా బీద రవిచంద్ర అభివర్ణించారు. టీఆర్ఎస్ నాయకులెవ్వరికీ చంద్రబాబుపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని అన్నారు.