సరళపై దాడి మీద జగన్ సీరియస్: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టుకు ఆదేశాలు

By telugu teamFirst Published Oct 5, 2019, 10:38 PM IST
Highlights

వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి చేశారనే ఆరోపణపై వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టుకు ఆదేశాలు జారీ అయ్యాయి. సరళ ఇంటిపై కోటంరెడ్డి దాడి సంఘటనపై వైఎస్ జగన్ ఆరా తీశారు.

నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెసుపార్టీ నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టుకు ఆదేశాలు జారీ అయ్యాయి. వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి కేసులో ఆయన అరెస్టుకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. ఈ సంఘటనను జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ నుంచి తిరిగి రాగానే జగన్ డీజీపి గౌతం సవాంగ్ నుంచి దాడికి సంబంధించిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని జగన్ గౌతమ్ సవాంగ్ తో చెప్పారు. చట్టం ఉల్లంఘించినవారు ఎవరైనా ఉపేక్షించవద్దని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో శ్రీధర్ రెడ్డి అరెస్టుకు ఆదేశాలు జారీ అయ్యాయి. శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆయనను పోలీసులు ఏ క్షణమైన అరెస్టు చేయవచ్చునని సమాచారం.

వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీధర్ రెడ్డి మద్యం తాగి వచ్చి శుక్రవారం రాత్రి కల్లూరిపల్లిలోని తన ఇంటిపై దాదడి చేశారని సరళ ఆరోపించారు. దాంతో సరళ నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. 

శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన లేఅవుట్ లో సౌకర్యాలు కల్పించుకోవడానికి అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేశారని ఆగ్రహించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఇంటిపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం శ్రీధర్ రెడ్డి తన నివాసానికి వచ్చి తాను లేని సమయంలో తన తల్లిని దుర్భాషలాడడమే కాకుండా ఇంటిలో విధ్వంసానికి పాల్పడ్డారని ఆమె చెప్పారు. 

పోలీసులకు తాను సమాచారం ఇస్తే స్వయంగా వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పారని, దాంతో తాను పోలీసు స్టేషన్ కు వెళ్లానని, ఆ సమయంలో ఎస్సై గానీ సిఐ గానీ లేడని ఆమె చెప్పారు. దాంతో ఆమె పోలీసు స్టేషన్ వద్దనే ఉంటానని చెప్పి ఆమె చెట్టు కింద కూర్చున్నారు. 

click me!