ఉషోదయ కిరణాల విశ్వ భాషను ఖమ్మం నుండి వురిమళ్ల సునంద రాసిన కవిత "జీవభాష తెలుసు" లో చదవండి.
కిరణానికి జీవభాష తెలుసు
నిశీథిని చీల్చుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించే వేదనా తెలుసు..
అందుకే...
నిన్నటి అలసటను రవ్వంతైనా
నీడలా తారాడకుండా
ఆకుపచ్చని ప్రకృతి మోముపై
నులివెచ్చని కిరణ సంతకం చేస్తుంది..
ఆకలి ఆరాటం తెలుసు.
డొక్కలు గుంజిన దేహానికి సరికొత్త ఆశల పానీయం తాపి బతికిస్తుంది..
ఉషోదయ కిరణానికి పక్షిభాషా తెలుసు
వేగుచుక్క కన్నా ముందే
వాటి హృదయాల్లో చేరి
కువకువల వేకువ రాగాలను ఆలపింపజేస్తుంది..
చిక్కని చీకటి ఆగడం తెలుసు
ఉషోదయ కిరణాల కొరడా ఝళిపించి
తొలి పొద్దు జెండాను ఊపి
సమస్త లోకాన్ని జాగృతం చేస్తుంది..
నదీ, సాగర భాషా తెలుసు
సాగిపోతూనే కాసిన్ని
వెండి వెలుగుల జల్లులతో మాట్లాడుతూ
సాగరంలో ప్రతిబింబం చూసుకుని
మురుస్తూ సాగి పోతుంది..
ఉషోదయ కిరణానికి విశ్వ భాషా తెలుసు
సమతా మమతా భావనా తెలుసు..
సర్వాంతర్యామియై తిరుగుతూ
నిత్య ప్రణామాలను అందుకుంటుంది...