ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్దం నేపధ్యంలో గీతాంజలి రాసిన కవిత "యుద్ధం ఏకాకి కావాలిప్పుడు!" ఇక్కడ చదవండి
యుద్ధం అంటే...
చల్లనైన వెన్నెలలో..పారిజాతాలో..మల్లెలో నిశ్శబ్ధంగా విచ్చుకోవడం కాదు కదా!
యుద్ధం అంటే.. వెన్నెలనే రక్తపు మరకలు చేయడం!
యుధ్ధమంటే..
దాహానికి మనిషి రక్తం అందడం !
నవ్వుల నదులుగా పారిన ఇళ్ళు
బ్రహ్మ జెముళ్లు అయిపోవడం !
యుధ్ధమంటే... రాత్రికి రాత్రే
భూమి రక్తపు నదులను వాంతులు చేసుకోవడం!
ఆకాశం నుంచి మేఘాలు
వర్షాన్ని కాదు..
మరణాన్ని కుమ్మరించడం!
యుధ్దమంటే..
తుపాకులు శవాలను కుప్పలు కుప్పలుగా ప్రసవించడం!
యుద్ధం అంటే...
తండ్రీ బిడ్డలను
ప్రేయసీ ప్రియుడ్ని
తల్లీ..కొడుకులను..
మొత్తం..
మనుషులనే విడదీయడం..
లేదా విడగొట్టడం !
మనుషుల్ని మాయం చేసి ..
యంత్రాలని మిగుల్చుకోవడం !
undefined
యుద్ధం అంటే..
మనిషి ముఖాన్ని పగల గొట్టి... చిరునవ్వులను దోచుకోవడం .
మనుషులను దొంగలుగా మార్చేయడమే కాదు....
దొంగలను కూడా పట్టియడం !
యుధ్దం అంటే ..
మట్టి గుండెల్లో విచ్చు కోబోతున్న విత్తనాన్ని..,
తల్లి గర్భంలో శ్వాసిస్తున్న పిండాన్ని..,
చంపేయ్యడం !
యుద్ధం అంటే..వేలమంది స్త్రీల యోనుల్లో నేరుగా గ్రైనేడ్లు పేలడం!
యుధ్ధమంటే..కడుపులో
పేగులకి అన్నమే దొరక్కుండా చేయడం !
అసలు..పేగులే లేకుండా చేసేయ్యడం !
మనిషి ఆకలి అని అరవకుండా నోళ్లు కుట్టేయ్యడం !
యుద్ధం అంటే..
పాలతో నిండిన తల్లుల రొమ్ములని ఎండగొట్టటం!
శిశువుల..లేత పెదాలను తల్లి రొమ్ములకే దూరం చేయడం.
యుద్ధం అంటే...
ఆనందంతో నృత్యం చేసే పాదాలను అడ్డంగా నరికేయడం!
యుద్ధం అంటే...
మనిషిని పక్షవాతంతో
ఆదాటున మంచాన పడేయ్యడం !
యుద్ధం అంటే.. నువ్వు నమ్మిన మనిషి...
నీ గుండెల మీదనే తన్నడం!
కాపుకొచ్చిన రైతు పొలంలో
లావాను ఒంపడం!
యుద్ధం అంటే....సరిహధ్ధుల ఆక్రమనే కాదు..
మనుషుల విశ్వాసాలను ...నమ్మక ద్రోహం చేయడం !
యుద్ధం అంటే...రసి కారే పుళ్లు... ఒంటి నిండా పాకే పేళ్లు
మాత్రమే కాదు..
యుద్ధం అంటే..
కన్నవాళ్లను చూడాలని తపించిపోతూ కార్చే కన్నీళ్లు మాత్రమే కాదు..
కన్నీళ్లకు కళ్ళే లేకుండా చేయడం !
యుద్ధం అంటే...
అమ్మకి.. క్షేమ సమాచారం రాయడానికి
ఒక కలమో..కాగితం ముక్కో... దొరక్కపోవడం మాత్రమే కాదు..రాయడానికి ముందే చేతులు నరకబడటం !
యుద్ధం అంటే...మనుషుల్ని విశ్వాసాలతో సహా పూడ్చివేసే ..సామూహిక సమాధి!
స్వేచ్ఛను బందీ చేసి.,
మనుషుల హృదయంలోని వెలుతురిని ..కారు చీకటి చేసేసే ...
ఒక అండా సెల్!
యుద్ధం అంటే.. ప్రకృతి పచ్చని తీవెలతో ఊగడం ..
లేత గరిక.. వాన చినుకుల్లో స్నానం చేయడం...
గులాబీ ఎండను తాగుతూ...వెచ్చబడడం..
వేసవిలో గూడు కడుతూ కోకిల పాడటం...
పాపాయి... తన తల్లి మొఖాన్ని పసి నవ్వులతో.,
రంగుల కాన్వాసు చేసేయడం
అంత సున్నితమూ..సుకుమారమూ కాదు కదా..
యుద్ధం అంటే..
వాడు... నీ-నా ముఖాల మీది హిజాబులు గుంజేయ్యడం..
కాషాయ రంగు...
గూనఘట్ల ముసుగుల్లో ముంచెయ్యడం మాత్రమే కాదు కదా..
యుద్ధం అంటే..
విత్తనం కోసం కాదు.. భూమిని అమాంతంగా మింగటం కోసం మాత్రమే
యుధ్ధాన్ని రచించే వాడు...
వాడే ...
తానే ఒక విధ్వంసక చిత్రకారుడై..
రక్తపు కుంచెలతో శవాల బొమ్మలని వేయటమే కదా..యుద్ధం అంటే!
ప్రాణాలు పోయే ముందర అమరులు విడిచే అరుపుల మధ్య...
వీరుడు..శూరుడు కాలేని వాడు.. దేశాలు దోచే దోపిడీ దారుడు
వికృతానందంతో ఫిడేలు వాయించడమే కదా యుద్ధం అంటే !
ఒక పక్క ఆయుధాలు అమ్ముతూ..అందిస్తూ..
మరో పక్క యుద్ధం వధ్ధు అనడమే...
ఒక మోసపు యుద్ధం కదా!
వాడిప్పుడు సరిహద్దుల భూమినే కాదు..డాలర్లనే కాదు..
మనుషుల శవాలను కూడా వాక్సిన్లు చేసే యుద్ధం
చేస్తున్నాడు!
అందుకే..యుద్ధం అంటే.. మనుషుల ఊపిరి తీయడం !
యుద్ధం అంటే...
కలివిడే లేనితనం!
యుద్ధం అంటే ఏకాకితనం
యుద్ధం అంటే అసలు.,
కూసింత కూడా హృదయమే లేనితనం!
అందుకే ..ఇప్పుడు
యుధ్ధాన్నే నిరాయుధగా మార్చడం కావాలి !
దానికో కొత్త ఆయుధం కావాలి
ఇప్పుడు..మనిషే ఆయుధం కావాలి.
యుద్ధం ఏకాకి కావాలి ఇప్పుడు.
యుద్ధం ఓడిపోయి..మనిషి గెలవాలి ఇప్పుడు!
మనిషి ముందు ..వాడి మతమూ-అణుబాంబు ఆయుధాలు..
మాయం అయిపోవాలి
అందుకే ..
రా..ఇప్పుడు..!
నువ్వూ-నేనూ-మనమూ కలిసి ..వాడితో
యుద్ధం చేయాలి!