ఇరుగు పొరుగు: మూడు మలయాళీ కవితలు

By telugu teamFirst Published Apr 8, 2021, 1:27 PM IST
Highlights

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ మూడు మలయాళీ కవితలను తెలుగులో అందించారు. వాటిని చదవండి.

అన్వేషణ 

నా కాలం నాకు సమస్య కాదు 
వేల  ఏళ్ళ క్రితమే 
నా భాషను దొంగిలించారు 
దాన్ని సరిచేయడానికి నాకవిత్వం 
ఇంకెంతో కాలం సరిపోదు 

బయటకు పీకేసిన నా కళ్ళతో 
ముందుకు లాగేసిన నా నాలుక తో 
నేనేం చేయగలను 
(నిన్ను అనుకరించడం తప్ప)
అందుకే 
విరిగి వంగిపోయిన నా వెన్నముక పైన 
ఓ దివిటీని వెలిగించి 
వెనక్కి నడవాలి 
ఇంకా వెనక్కి నడవాలి 
కుడికో ఎడమకో 
మలుపు తిరగకుండా 
ఇంకా ఇంకా వెనక్కి నడవాలి.

మలయాళ మూలం: అమ్ము దీప 
ఇంగ్లిష్:కె.సచ్చిదానందన్ 
స్వేచ్చానువాదం : వారాల ఆనంద్ 

కాలం 

పదాలు నన్ను అల్లుకుంటున్నప్పుడు 
సముద్రపు గాలులు 
ద్వీపం పైన 
కొట్టుమిట్టాడుతున్నాయి 

లవణ నిశ్శబ్దంతో సముద్రం జ్వలిస్తోంది 
భూమికి పరాయిదయిన కాంతి 
గాలిలో నిండి  పోతున్నది 

తీవ్రమయిన వాసన 
మాసం కండగా రూపాంతరం చెందుతూ 
తన రెక్కల్ని ఆడిస్తున్నది 

ఆహారం బల్ల మీద 
మధ్యాహ్న భోజనం 
అస్థిరంగా కదులుతున్నది  

భరించలేని ప్రవక్తల ప్రవచనాల 
శ్వాస కదలికల వల్ల 
ఆకాశం తల కిందికి వంచి 
భూమిని తాకుతున్నది 
పదాలు ఎప్పుడయితే 
నన్ను ‘మట్టిలా’  మారుస్తాయో 
అప్పుడు 
నీడల్లోంచి పరిమళాలు ఎగజిమ్ముతాయి.

మలయాళీ మూలం : ఆర్. జార్జ్ 
ఇంగ్లిష్ : ఎస్. చంద్రమోహన్
స్వేచ్చాను వాదం : వారాల ఆనంద్ 

బానిస మాట 

నా ధృఢ మయిన పాదాల మీద 
అతను ఎంత లోతయిన గాయాలు 
చేసినప్పటికీ 

నేను నా నడకను కొనసాగిస్తూనే వున్నాను 

నా అడుగుల ముద్రల్లోంచి 
ఎగిసిన ఎర్రటి రక్తం 
ఎలాంటి అచ్ఛాదనా లేని 
నా నల్లటి పిరుదుల పై 
మరకలై కనిపించినప్పుడు 

అతను భయంతో భీతితో 
కంపించి పోయుంటాడు.

మలయాళీ మూలం : కె.ఎం.ప్రసాద్ 
ఇంగ్లిష్ : ఏ.జె. థామస్ 
స్వేచ్చానువాదం : వారాల ఆనంద్

click me!