కలలు పండాలన్న కోటి ఆశల్తో కళకళలాడుతున్న క్రొత్తావి కోన!!! అంటూ విశాఖపట్నం నుండి శాంతి రాసిన కవిత ' శోభాకృతి ' ఇక్కడ చదవండి :
వార్ధక్యం వాల్తున్న వాకిళ్ళ ముందర
కన్నీళ్లు తాగిన కాలం చెట్టుకు
మంతనాలు మాని మస్తుగా పడ్తున్న
కాసిన్ని కలల వాగు నీళ్లు
తొడిగిన క్రొత్త కబుర్ల తోరణం
చుట్టే పచ్చ శిలీంధపు శుభేచ్ఛ
ఎటో ఎగిరెళ్ళిపోకుండా
ఎరవేసి పట్టుకున్న ఎఱసంజ*
లోగిలిలో గిలిగింతల లెక్కలు విప్పే
లాలిత్యపు లేలేత తాటి ముంజె!
ఆకతాయి కాకుల్ని అదిలించి వెళ్ళగొట్టి
ప్రేమను పదిలంగా పట్టి తెచ్చి
"కుహు..కుహూ.." మంటూ కూసిన కూత
మచ్చిక కోసం మథనపడుతూ
పచ్చిక లేక పడున్న పొడి రాళ్ల
ఇచ్చకాలు మెచ్చి ఈప్సితాలు తీర్చి
నేలంతా పూచే నెనరు వనరుల నది
నడిచొచ్చే గుర్తుల నెమరువేత!
మారాము చేస్తున్న మామిడి పూ ఊడ్పు
శ్రీముఖమయ్యే సింగారాల కమ్మగాడ్పు#!
ఎగబ్రాకిన ఏటి పున్నమి వెన్నెట్లో
ఎలదోటన ఎగరేసిన నీటి పాట
' శోభకృత్ ' యాత్రా శుభసందేశం పొంది
సామోదంగా సరిగమలతో పారే సరిత్తుకై
ప్రమోదం ప్రకటించిన పెరటి పరిషత్తు..!
దుఃఖ దూషణ నోరారా మింగేస్తే
దూరాభారమైన దోస్తుల జాగాలకై
అతికి మతికి తెచ్చుకున్న మైత్రీ భావాలు
చైత్ర చిత్రాల బాజా భజంత్రీలు
చప్పట్ల చినుకుల్లో చిత్తుగా తడిసినా
పిట్ట గానం హృదిని హత్తుకునే మ్రోగాలని
రెక్కలల్లార్చి రాగాల రాశులు ఎత్తుకొచ్చి
పేరంట మొచ్చిన చిలుకల పేరులు!
రేయంతా రంగులద్దే రంగరితో కూడి
మెరిసే అనుభూతుల మిలమిలల్ని
అర్పించుకొని ఆర్తిగా అక్కున చేర్చుకున్న
కాంతి కళల తారా సుందరి
జాజ్వల్యమైన జీవితపు జిజ్ఞాసల పందిరి
సంకోచించక 'సబాహ్యాంతర సశ్శుచి'కై
కురుస్తూనే ఉన్న అమృతపు వాన
కలలు పండాలన్న కోటి ఆశల్తో
కళకళలాడుతున్న క్రొత్తావి కోన!!!
* ప్రభాత సంధ్య
# మలయమారుతం