పుట్టుక చావుల మధ్యనున్న ప్రతి క్షణం నీదే అంటూ నస్రీన్ ఖాన్ రాసిన కవిత " జీవితం " ఇక్కడ చదవండి :
లేలేత చిగుళ్ళు
గాలితో కరచాలనం చేస్తే
పూవనంలో రెపరెలాడే మొగ్గలు
సూర్యుని పలకరింతకు
ఫక్కున నవ్వితే అది జీవితమే
అడుగడుగునా తారసిల్లే ఏమార్పు కూడళ్ళతో
మెదడూ మనసూ పోటీ ఊయలలో బరిలోకి దిగితే
సంతులనం కొలిమిలో పరీక్షకు నిలబడుతుంది
గంతలు కట్టిన గుర్రానికి రహదారి ఒక్కటే తెలిసినట్లు
అర్జునుడి కంటికి చెట్టు కొమ్మల్లోని పక్షి మాత్రమే కనబడినట్లు
నీకు జీవించడం తెలిసుండాలి
జీవన మధురిమ తరగని నిధి
పుట్టుక చావుల మధ్యనున్న
ప్రతి క్షణం నీదే
బతుకు నాణేనికి కష్ట సుఖాలే పార్శ్వాలు
ఏదీ శాశ్వతం కాదన్న రహస్యం గ్రహించు
దృష్టి కోణం మార్చుకో
మోడువారిన చెట్టుకు చిగురింతేగా జీవితం