రమేష్ కార్తిక్ నాయక్ తెలుగు కవిత: మాట్లా

By telugu team  |  First Published Dec 27, 2019, 2:49 PM IST

రమేష్ కార్తిక్ నాయక్ రాసిన తెలుగు కవిత మాట్లాను ఏషియా నెట్ న్యూస్ పాఠకుల కోసం అందిస్తున్నాం. 


మాట్లాకి బయిట కొత్తగా చిగుర్లెస్తున్న  తడి 
తియ్యని కలల్ని గాలికి బహుకరిస్తుంది 

మాట్లా లోపల సముద్రాల్ని 
పటిక రాయి చిలికించి చిలికించి 
నురగ పొంగులో నిశీధి మౌనాన్ని అల్లుతూ 
నడిసముద్రంలో కరిగిపోతుంది 

Latest Videos

కరుగుతున్న బెల్లాన్ని 
కళ్ళ పారదర్శకతలోంచి నిరీక్షిస్తూ 
ఆమె ఎప్పుడు లెక్క వేసుకుంటుంది 

సారాయి కాయడానికి తెచ్చిన ఎర్రమట్టి గడ్డి విత్తనాలకు పచ్చని రెక్కల్ని ఇచ్చింది కానీ 
వాటి వేర్లను ఊపిరాడనివ్వకుండా మూటగట్టింది 

మాట్లాలోని ఉక్కపోత 
ఆమెని నిద్రపోనివ్వట్లేదు 
ఆమె చేతి వేళ్ళకు ఉన్న ఉంగరాలకు చిగురించిన
కాసులు మొక్క జొన్నల్ని ఆరగిస్తుంటే 
కాసుల కాంతి ఆమె చేతి రేఖల్ని  చీల్చడానికి యత్నిస్తుంది 

చీకట్లో  భూమి నడకని కొలుస్తూ 
మౌనంగా తనపై రాలిన నీడని 
దొర్లిస్తూ 
కదలిక లేని నాట్యాన్ని నర్తిస్తూ 
నురగలు కక్కుతుంది మాట్లా

అతడు నిశి తవ్విన రూపకాల్ని 
చంద్రుడి వైపు చల్లుతూ 
తన దాహాన్ని 
నక్షత్రాల మిణుకులోంచి పోగుచేసుకున్న వెండి ఇసుకతో 
పూత పోసుకుంటాడు 

మాట్లాలోని పొంగు మాయమౌతుంటుంది 
సారాయి కోసం అతను తనని తాను తవ్వుకుని ఏ ములైన ఇంత మత్తు దొరుకుతుందేమో 
అన్వేషిస్తాడు 

ఆమె సూర్యుడు దించిన తెరపై 
కొత్త చిత్రాన్ని సగంలోనే ఆపేసి ఇల్లు చేరుకుంటుంది 

మాట్లా మాట్లాడకుండానే కూర్చుంటుంది 
దానిలోపల  చిక్కబడుతున్న తేనెని పలకరించే ఓపికలేక 

ఇద్దరు ఆ నీలి మేఘాల 
పుప్పోడిలో  ధూళిలా మారిపోవడానికి 
మాట్లానే ఇల్లనుకుని కారిపోవ 
జారీపోతారు 

మాట్లా చుట్టూ తిరగడానికి 
సూర్యచంద్రులు ఇప్పుడు తండాలోకి రావచ్చు 

* సారాయి తయారీకి  బెల్లం పటిక  నీళ్లలో కలిపి పులియపెట్టే కుండ

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

click me!