తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వం విశిష్టమైంది. నక్క హరిక్రిష్ణ రాసిన తెలుగు కవిత కలల ప్రపంచం మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.
ప్రమత్తతలో మునిగిపోయి
ఇంకా ఎంతకాలం !?
ఈ అసహజ పాండిత్యం
అక్షరాల నరమేధం
ఒక్కసారి పరీక్షించి చూడు
చీకటి సామ్రాజ్యం మాటన
నీ నీడ మాయం అయిపోతుంది
అస్తిత్వం అత్యాచారమవుతుంది
సిరా చుక్కల మీద
పన్నాగాల విచ్చుకత్తులు నర్తిస్తున్నయి
దూర తీరాల నుంచి వచ్చిన శాసనం
మాయా ప్రపంచాన్ని సృష్టించించింది
నాడీ మండలం కబ్జా అయింది
వాయువులో విషమెక్కడుందో గుర్తించలేవు
నీటిలో ప్రాణం జాడను పట్టలేవు
సగం కాలిన చేతుల చివరన
కలుపు వేర్లు మొలుస్తున్నయి
శరీరంపై పాతుకుపోతున్నయి
ఇప్పుడు నువ్వింకొక
కుంటా కింటేవి
తరాలు అంతరించబోయే
పరోక్షప్రకటిత
నవీన బానిసవి
నీ కలల ప్రపంచం .,
నీ వాళ్లలో నువ్వు తగలబడిపోతావు
అలవోకగా
కంచంలో పంచబడతావు
జీర్ణమైపోతావు
సాగుతున్న తొండి ఆటలల్ల
కాలుతున్న నిచ్చెన మీద
తల అటూ ఇటూ తిరుగుతుంది
రెక్కలు రాలిపోతాయి
కళల గాలిపటం ముక్కలు
గాయాలతో నేలమీద పొర్లుతుంటాయి
నువ్వు నమ్మిన స్వేచ్ఛా విహంగం
కళేబరాలను తయారు చేస్తుంది
నిర్జీవ స్థితిలో …..
అబద్ధం నిజం అవుతుంది
వాస్తవం నివురు కింద నలుగుతుంది
ఇక కళ్ళకు పొరలను చుట్టకు
కాలానికి రంగును పూయకు
ఇప్పుడు, నిలబడే స్థలం కోసం
ఆలోచనలకు హరితవర్ణం అందివ్వు
మురికి గోడల విధ్వంసాలకి
ముగింపు పలుకును వినిపించు
చూపులను వడగట్టి చూడు
మూడు రంగుల భూమిపైనే
ఇరవైనాలుగు ఆకుల ధర్మ చక్రం కింద
విశ్వమానవుడు వేచిఉన్నాడు
కిరణాలు లేతదనాన్ని అద్దుకున్నట్లు
గుండెనిండా మనిషిని నిలుపుకొని
ఇంద్రధనస్సుల ఆలింగనాలను అందుకుందాం
అన్యాక్రాంత ఉషోదయాలను
సంకెళ్ళ నుండి విడిపించుకుందాం
మరింత తెలుగు సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature