కోట్ల వెంకటేశ్వర రెడ్డి తెలుగు కవిత: కన్నీటి మడుగు

By telugu teamFirst Published Jul 16, 2020, 4:21 PM IST
Highlights

వ్యవస్థలోని ద్వంద్వ ప్రమాణాల వలన రక్త సంబంధాలు ఎట్లా చిట్లి పోతున్నవో ' కన్నీటి మడుగు' కవితలో కోట్ల వెంకటేశ్వర రెడ్డి తెలియజేస్తున్నారు. చదవండి.

రెక్కలు తెగిన
వాన చినుకులు నేల రాలినట్లు
వాంఛిత స్వప్నాలన్నీ
నిలువునా కుప్పగూలుతున్నాయి!
ఎవరి తలుపూ తట్టలేను 
ఎవరితోనూ ఎద విప్పలేను
దుఃఖమిట్లా ఒక్కసారిగా
భూమ్యాకాశాలు ఏకం చేస్తుందనుకోలేదు
కాలాన్ని జయిస్తామన్న విశ్వాసం
గాలిలో దీపమని తేలిపోయింది!
నదులూ సముద్రాలే కాదు
భూగోళమంతా కన్నీటి మడుగే!
పొట్ట జానడే
రెక్కలు ముదుర్కొని
చెట్టు మీదే పక్షి ఎంత కాలముంటది?
ముక్కూ నోరూ మూసుకున్నా
నిశ్శబ్ధం ఎట్లా బద్ధలవుతుందో
ఎవరి రక్త సంబంధం ఎట్లా చిట్లిపోతుందో
ఎవరినీ నేనిప్పుడు నిందించదలచుకోలేదు!
అందరూ బాధ్యులే అంతా బాధితులే!
ప్రాణాలొడ్డి
దీపాలు వెలిగిస్తున్న వైద్యుల్ని చూస్తున్న
లాఠీ చేత ఉన్నా
కారుణ్యం చూపిస్తున్న ఖాకీలను తిలకిస్తున్న
శవాలను దాచే‌సి
బేరసారాలకు దిగుతున్న 
కార్పో'రేట్' వైద్య వర్తకుల ప్రవర్తన వీక్షిస్తున్న
ఇంత వైరాగ్యంలోనూ
ఇన్ని ద్వంద్వ ప్రమాణాలా?
ఎవరూ ఆవలి ఒడ్డున ఉన్న దాఖలాలు లేవు
మృత్యువుకు ఆవల ఈవల తేడాలుండవు
ఇవ్వాళ నిద్రిస్తున్న మనిషి
రేపు పలకరిస్తాడన్న గ్యారెంటీ లేదు!
చావు పుట్టుకల
మర్మం ఎరిగిన మని‌షికి
ఈ అర్ధాంతర నరుని అంతర్ధానం
జీర్ణించుకోలేని కొత్త అనుభవం!!

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

click me!