సంగెవేని రవీంద్ర కవిత : లోలోన

By SumaBala BukkaFirst Published Aug 25, 2023, 11:15 AM IST
Highlights

ఇంతకాలం దాన్ని ఏకాంతమనే అనుకున్నా కానీ తీరా చూస్తే... అది కవిత్వమై సలపరం పెడుతోంది.. అంటూ ముంబై నుండి సంగెవేని రవీంద్ర రాసిన కవిత ఇక్కడ చదవండి : 

పోగొట్టుకున్నదాని కోసం ఆరాటపడుతూ
ఉన్నదేదో పోగొట్టుకుంటూ
ఊరికే అలా కూర్చున్నాను
నాలోని నన్నే ఎదురుగా నిలబెట్టుకొని...

అప్పుడొచ్చిందది
అలవోకగా నన్నల్లుకొని అణువణువు ఆవహించింది
ఇహ నాకేం వినిపించడం లేదు
ఏ దృశ్యాలు కనిపించడం లేదు
అట్టడుగు పొరల్లో ఏదో నిశ్శబ్ద విస్ఫొటనం
స్పృహ తప్పిన చూపుల్లో రెటీనా కలకలం
ఎడారి గుండెల్లో భావాల తుఫాన్

శిథిలమైన బతుకు కోటలో
పాతరేసిన పాత పేజీల్నుండి 
బరువైన క్షణాల్ని అడుగంటిన కన్నీటి కుండలో
ఒక్కొక్కటిగా జారవేత
అంతా చీకటిగా ఉన్న తలంపు

అకస్మాత్తుగా ఓ వెలుగు రేఖ
గడ్డకట్టిన మౌనం బద్దలై 
అక్షరాల అశ్రుప్రవాహం
పెనం పై జారిన నీటిబొట్టులా ఆవిరయ్యే ఆవేశం
తేలుతూ.. మునుగుతూ తీరం కోసం తండ్లాట

నాకు నన్నే పరాయి వాణ్ణి చేసే అది
భావోద్వేగాల రహస్యపు గది
అప్పుడు నన్ను నేను నిజంగానే పోగొట్టుకుంటాను
దాని చేతిలో కీలుబొమ్మనవుతాను
ఒకానొక అంతర్ముఖ గమ్యాన్ని శోధించే
బాటసారినవుతాను

దాన్ని వదిలించుకోవాలనే ఉంది
కానీ అది నాకు యుద్దాన్ని నేర్పుతోంది
గొంతు దాటని దుఃఖానికి కాంతిపూల పదనుపెడుతోంది
అద్దంలా ఎదురు నిలిచి ఎవరో అపరిచితుణ్ణి చూపుతుంది
అది నేనేనని రుజువు కూడా చేస్తుంది
ఇంతకాలం దాన్ని ఏకాంతమనే అనుకున్నా
తీరా చూస్తే... అది
కవిత్వమై సలపరం పెడుతోంది..

click me!