తులాభారాల పాలనలు మనిషి బరువుని దించలేకపోతున్నాయి అంటూ ఒబ్బిని రాసిన కవిత 'బరువు' ఇక్కడ చదవండి :
సూర్యుడికి ముచ్చెమటలు పడుతున్నాయి
మహా నగరాల్లోని శిఖరాల గూళ్ళ పెండికట్టులో
తన కిరణాలు దూరడానికి సందు దొరక్కపోవడం చేత !
మనుష్యులకి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి
కట్టెల మోపుల బరువుల కంటే కూడా బరువైన
మానసిక బరువులని మోయలేక
మనుషులకి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి !
లోకానికి బతకలేనితనం
ఓ మహా పర్వతాల బరువులా మారింది !
భూగోళం బొంగరంలా తిరుగుతుంది శిరస్సుల మీద !
నెత్తిమీద పాము పడగై బుసగొడుతుంది బతకలేనితనం!
undefined
అరచేతుల మీద ఖాళీ అన్నం గిన్నెలు
నిరతం ఆకలి గొంతు చించుకుంటూనే ఉన్నాయి !
మనిషి స్నానాల గదిలో
నీళ్ళతో కాకుండా కన్నీళ్లతో స్నానం చేస్తున్నాడు !
తులాభారాల పాలనలు
మనిషి బరువుని దించలేకపోతున్నాయి !
ఆకాశం రక్త విభూతి రేఖలు దిద్దుకుంటుంది !
మంచు దుప్పట్లు
వృక్షాల ఊతకోసం ఎగబడుతున్నాయి !
బరువు ఎరువుతో పెరుగుతున్నాడు మనిషి !
చేతులు కాళ్ళు మట్టిలో ముంచకుండా
జతల జతల చేతులు , జతల జతల కాళ్ళు
వలలా అల్లుకుంటున్నాడు !
ఓ పుష్పాన్ని , ఓ ఫలాన్ని వరంలా కోరుకోవడం లేదు !
బతకలేనితనంతో బావురుమంటున్నాడు మనిషి !
క్షణాలన్నిటినీ ఈటెల బరువుగా మార్చుకుంటున్నాడు !