గ్రామీణ గుభాళింపుల్ని వదిలి రయ్ మంటూ తిరిగే మోటర్లపట్నం రాలేనంటున్న తండ్రి వేదనను కోటం చంద్రశేఖర్ రాసిన కవిత ' మీరే రండి ' లో చదవండి :
ఇల్లుని వాకిలిని ఎడ్లని దూడలని చెట్లని చేలని
ఈ నడిచిన నేలని
వదలలేకపోతున్నా వదిలి రాలేకపోతున్నా
కొడుకా నీవు రమ్మంటున్నది నిజం కాదనలేని నిజం
నా శరీరం ఒప్పుకోవడంలేదు
ఇల్లంటే రాయి , రప్పని
వాకిలంటే దుమ్మూ , ధూళని అనుకోలేదు
పాతేసిన గుంజనో పైకిలేచే గింజనో నాకే ఎరుక
కష్టమో కామితమో నా ఏవుసం నాకే ఎరుక
నాలెక్కవేరు నాసుక్కవేరు
దూపైతే వాగుల సెలిమె దీసి నీళ్ళమీద బట్టేసి తాగుతా
కొట్టంలో ఆవులకు మేతేస్తూ వాటిని నీళ్లకు వదులుతా
గంగడోలు నిమురుతూ ఆనందపడ్తా
వరండాలో నుల్క మంచమేసుకొని మేకల గొతికల్ని
గోలికాయల్లా లెక్కబెడ్తూ సంతృప్తిపడ్తా
ఎక్కడెక్కడో తిరిగినా రాత్రికి నా కడుపుల తలపెట్టె
గారాల పిల్లి తోకని చూస్తూ సంబరపడ్తా
ఏం చెప్పను నా తీయని యెతలు
ఏం దాచను నా ఆత్మీయ కథలు
ఇప్పటివరకు ఎవరితోనూ వేలెత్తి చూపించుకోలేదు
వైరుధ్యాలు వైవిధ్యాలు కోరలేదు
హారంలో దారంలా వున్న
రయ్ మంటూ తిరిగే మోటర్లపట్నం రమ్మంటున్నావు నీవు
రహదారుల వెంట చూద్దామంటే రవ్వంత చెత్త కనపడని
అద్దంలాంటి రోడ్డులో గ్రామీణ గుభాళింపుల్ని ఆశించి
భంగపడతాను నేను రాను
అక్కడ
కోడలుపిల్ల జాగ్రత్త నీ పిల్లలు భద్రం
కళ్లకి దూరంగా వున్నా మనసుకు చేరువగానే వున్నారు మీరంతా
వచ్చేనెల అమ్మది సంవత్సరీకం
మీరే రండి