తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వం విశిష్టమైంది. కందాళై రాఘవాచార్య రాసిన కవితను మీ కోసం అందిస్తున్నాం. చదంవడి.
ఝాము ఝాము జాగృతం చేసే
తురాయి కోడి రాజుకే రోగం
బాకా గొంతు పీకల దాక
పడి పోయింది ----
జల స్తంభన
జలకాలాటల బాతుకూ బడారోగం
గుంపుల బాతుల పై
గంప గుత్త మృత్యువు !
కాకి సోపతి కటీప్ ----
పితృ దేవతల పిండం
సద్గతులుగా ముట్టేదెవరు ?
కాకులకూ కాని కాలం
శకున పక్షులకే అప శకునం
మనిషి సహవాసి
పక్షికీ పాడురోగం
"బర్డ్స్ ప్లూ" -- రెక్కలు ముక్కలు
ఆదివారం వంటింట్లోకి
కోడికి ప్రవేశం లేదు --
వంటింటి ముందు పుర్రె గుర్తు
ఫోర్కులూ మూతి ముడుచుడే
స్టార్ హోటల్ మూకుట్లో గోలని
కోడి జన్మ వ్యర్ధం
ధర రెక్కలు తెగి పడింది ----
గొంతు జారే చుక్క విందుకు
చికెన్ విరహం ??
కొత్తకొత్త -- పాతపాత రోగాలు
విప్లవంగా తిరగబడుతున్నాయి
పక్షి ముద్దు కాదు
మనిషీ ముద్దు కాదు
కరోనా - బర్డ్స్ ప్లూ జుగల్ బందీ !
పదండి !
మన రెక్కలకు
పక్షులను కట్టుకుని
ఆరోగ్య అరణ్యాల్లోకి పోదాం --
మన ఆదిమానవ తాతల వలె
జలపాతాల మందు
హఠంతో పీటం వేసుకుందాం
ప్రకృతితో మమేకమౌదాం
కలుషిత నగరాలు పాడుపడిపోనీ
కొత్తగా అంతం కాని కల్పం మనదే
పక్షి బతకాలి
మనిషి బతుకాలి
మనిషి వేయి రెక్కల బలంతో
భూమిని గ్రహాలను
గుండ్రంగా తిప్పుతూ రాజ్యమేలాలి
సర్వేజనాంపక్షినాం సుఖినోభవంతు
- కందాళై రాఘవాచార్య