కందాళై రాఘవాచార్య కవిత: మా  ఊరి పిట్టలు!!

By telugu team  |  First Published Jun 8, 2021, 2:10 PM IST

లోపల ఇల్లేమో మనది /ఇంటి ముందు చూరేమో పిట్టలది అంటన్న  కందాళై రాఘవాచార్య "మా  ఊరి పిట్టలు !" ను చదవండి.


పక్క  ఊరికి వచ్చినా మా ఊరి
పిట్టలే కనిపిస్తున్నాయి
అవును ! నేను గుర్తు పట్టగలను
కిచ కిచలు నాకు ఎరుకైనా భాషనే మరి !

మా ఇంటి చూరు కింది పిచ్చుకలే
ఇక్కడి చూరుల్లో చేరినట్లున్నాయి
ఆశ్చర్యం ! నాకు తెలువకుండానే
పిట్టలు నా వెంటవచ్చినట్లున్నాయి
నేను బస్సులో
పిట్టలు ఆకాశంలో 
చిన్ని రెక్కలకు ఎంత అలసటైందో
సంతనుంచి నూకలు తెచ్చి
పిచ్చుకలకు సంతర్పణ చేయాలి

Latest Videos

నాలో పక్షి ప్రేమ గూడుకట్టుకున్నట్లే
అన్ని ఊర్ల పిట్టలు 
మా ఊరి పిట్టల్లాగే అనిపిస్తాయి!
చెప్పుకుంటే అంతా హేలనచేస్తారు వికార ముఖంతో
పైన రెట్టలు రాలినట్లు !
వాళ్లు పక్షి ప్రేమికులు కాదన్నట్లే

ఎంత పెద్ద సంక్రాంతి ముగ్గు వేసినా
పిట్టలు ముగ్గుల్లో తిరుగాడితేనే
అది పెద్ద వాకిలి - పిట్టల స్టేడియం
లేకుంటే వాకిలి బోడ బోడ

నిజంగా పిచ్చుకలు ఊర్లో కనిపిస్తేనే
ఆ ఊర్లో ప్రాణాంతక
కాలుష్యం లేనట్లు
అయ్యో ! ఏ పాడు కాలానికైనా
మన పిట్టలు కనిపించకపోతే
ప్రకృతి తల్లి పిచ్చిలేసిపోతుంది
అకాలంగా మనిషి ఉనికికీ ప్రళయం

మనకు తెల్వదు ‌ ఊర్లన్నీ
పిచ్చుకలపేర్ల మీదే ఉంటాయి
అందుకే వాటిని ముద్దుగా
ఊర పిచ్చుకలంటారు !
లోపల ఇల్లేమో మనది
ఇంటి ముందు చూరేమో పిట్టలది
 
అదిగో ! అద్దాన్ని పిట్టలు 
ముక్కుతో పొడుస్తున్నాయి
అద్దం కూడ పిట్టలదే

పిట్టల్లేని ఊరు పుట్ట కిందికి జమ
పిట్టలుంటేనే ఊరు
ఊరు పిట్టల జాగీరు

click me!