తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి జోగు అంజయ్య జనగాం నుండి రాసిన పాట ' గద్దరంటే ఎవరు? ' ఇక్కడ చదవండి :
పల్లవి.
గద్దరంటే ఎవరు?
గాలి బుడగ కాదు అతను
గమ్యం కోసమే
పాటతోనే గర్జించెను
యుద్ద నౌకను నడిపే
సమరశీల పోరాటం.
"గద్దరంటే ఎవరు?'
చరణం.1
మెదకు జిల్లా తూప్రాన్ లో
పుట్టి పెరిగినాడు
కడగండ్ల బతుకు చూసి
కలం పట్టినాడు
గొంతు విప్పి గోడు చెప్పి
జనం బంధువు అయినాడు
విప్లవమే తలరాతను
బాగు చేయు నన్నాడు
"గద్దరంటే ఎవరు? "
undefined
చరణం 2
అంబేద్కర్ అడిగిందే
అడవి పూవు ఇస్తుందని
ఆయుధాల స్వరం తోటి
చీకట్లను చీల్చిండు
ఉష్ణతార కడుపులోన
ఊసులెన్నో నేర్చిండు
రాజ్యమొచ్చే తోవ చూపి
మావో బాట నడిచిండు
"గద్దరంటే ఎవరు? "
చరణం.3.
పొడుస్తున్న పొద్దు చూపి
తెలంగాణ దిశను మార్చే
భూస్వామ్యం ధనస్వామ్యం
తోడు దొంగలని చెప్పెను
కులం దాటని వర్గం
కూలిపోతే చూడాలని
తుపాకీ గుండ్లు మింగి
ఎగురవేసె ఎర్ర జెండా
" గద్దరంటే ఎవరు? "
చరణం.4.
కొంగు నడుముకు చుట్టిన
లచ్చుమమ్మ కొడుకు ఇతను
గోచి గొంగడి వేసి
కాలికి గజ్జెలు కట్టెను
కష్ట జీవి తత్వమంత
కవిని మించి కూర్చిండు
రాగంతో ఆడి పాడి
రణ భూమిలో నిలిచాడు
"గద్దరంటే ఎవరు? "